
కనపడవా?
నది దాటాలంటే నాటు పడవే దిక్కు
ప్రమాదకరంగా ప్రయాణం
వంతెన నిర్మించాలి..
మా కష్టాలు..
హిరమండలం: కల్లట పంచాయతీ పరిధిలోని జిల్లోడిపేట, కల్లట గ్రామాల మధ్య మహేంద్రతనయ నదిపై పడవ ప్రయాణాలు ప్రమాదకరంగా సాగుతున్నాయి. జిల్లోడిపేట గ్రామస్తులు పనులపై ఎక్కడికి రాకపోకలు సాగించాలన్నా నాటుపడవపై నది దాటాల్సిందే. మండలకేంద్రానికి వెళ్లాలన్నా, బడికి వెళ్లాలన్నా రోజూవారీ పడవ ప్రయాణం తప్పదు. ప్రస్తుతం గ్రామంలో పదుల సంఖ్యలో విద్యార్థులు 6 నుంచి ఇంటర్ వరకూ చదువుతున్నారు. వీరంతా పడవలోనే అవలంగి, హిరమండలం, పాతపట్నం వెళ్తుంటారు. వంతెన లేకపోవడంతో ప్రమాదకర పరిస్థతుల్లో పడవపై ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుతుంటారు.
వంతెనకేదీ మార్గం?
ఇక్కడ వంతెన నిర్మించాలని దశాబ్దాలుగా జిల్లోడిపేట గ్రామస్తులు పోరాడుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి శత్రుచర్ల విజయరామరాజు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అది ఎన్నికల స్టంట్‌గా మిగిలిపోయింది. అటు తరువాత 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా మరోసారి వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి హడావుడి చేసింది. తర్వాత పనులు చేయకుండా చేతులెత్తేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఇంతలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. గత అనుభవాల దృష్ట్యా , ముందున్న ప్రభుత్వ చర్యలు పుణ్యమా అని కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో నిధులు మంజూరు చేసినా ఫలితం లేకపోయింది. తాము అధికారంలోకి వస్తే జిల్లేడుపేట వద్ద వంతెన నిర్మాణం చేపడతామని స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రమాదకర స్థితిలో మహేంద్రతనయా నదిని దాటుతున్నాం. నదిలో నీటి ఉధృతి అధికంగా ఉండే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఆ సమయంలో గ్రామానికే పరిమితం కావాల్సి ఉంటోంది.
– రావాడ అమ్మన్న, జిల్లోడిపేట
వర్షాకాలంలో మా అవస్థలు వర్ణించలేనివి. ఒక్కోసారి మూడు నెలలకోసారి రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. ఇప్పటికై నా పాలకులు స్పందించి వంతెన నిర్మాణం పూర్తిచేయాలి.
– కొర్ను ధనుంజయరావు, జిల్లోడిపేట

కనపడవా?

కనపడవా?