
వైఎస్సార్ సీపీ పాలనలోనే కళింగవైశ్యులకు గుర్తింపు
● చంద్రబాబువి ఓటుబ్యాంకు రాజకీయాలు: కరిమి రాజేశ్వరరావు ● గత ప్రభుత్వంలోనే ప్రశాంతంగా వ్యాపారాలు: అంధవరపు సూరిబాబు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):
సీఎం చంద్రబాబు కళింగవైశ్యుల్ని ఓటుబ్యాంకుగానే వాడుకుంటున్నారు తప్ప కళింగవైశ్య కులంలో ఏ ఒక్కరికి చెప్పుకోదగ్గ పదవిని ఇచ్చిన సందర్భాలు లేవని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల పరిశీలకుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ కల్యాణ మండపంలో కళింగవైశ్య కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర కళింగ వైశ్య వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కళింగవైశ్యులకు జిల్లా నుంచి సుడా చైర్మన్, కళింగవైశ్యకుల కార్పొరేషన్ చైర్మన్, 10 మంది డైరెక్టర్లు, ఏఎంసీ చైర్మన్, ఎంపీటీసీ వంటి అనేక పదవులిచ్చి తగిన గుర్తింపునిచ్చారన్నారు. గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోయేలా జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. కళింగ వైశ్యులంతా వైఎస్సార్‌సీపీ వెంటే ఉంటారని, మోసకారి టీడీపీని పక్కనపెట్టాలని పిలుపునిచ్చారు.
– వైఎస్సార్ సీపీ కళింగ వైశ్య కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ కళింగవైశ్యులంతా ఏకతాటిపైకి వచ్చి వైఎస్సార్‌సీపీ గెలుపునకు సైనికుల్లా పనిచేద్దామన్నారు. దివంగత రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిలతోనే కళింగవైశ్యులకు తగిన గుర్తింపు లభించిందన్నారు. 56 కార్పొరేషన్‌లు ఏర్పాటుచేసి చైర్మన్ పదవులిచ్చి బీసీలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. పేదలకు నాణ్యమైన వైద్యవిద్య నందించాలన్న ఆలోచనలతో జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలకు నిర్ణయించి 5 కాలేజీలు ప్రారంభిస్తే మిగిలిన వాటిని చంద్రబాబునాయుడు ప్రయివేటువ్యక్తులకు అప్పగించడం సరికాదన్నారు. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క వ్యాపారికీ ఇబ్బందులు కలగలేదన్నారు. ప్రజలందరి వద్ద డబ్బులు ఉండటంతో వ్యాపారాలు సక్రమంగా జరిగేవన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. కళింగవైశ్యులంతా చాలా శక్తివంతులని, ప్రతి ఒక్కరు బాగా పనిచేసి భవిష్యత్‌లో వైఎస్సార్‌సీపీ గెలుపులో కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పార్టీకోసం పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు.
– వైఎస్సార్‌సీపీ కళింగవైశ్య కుల ఉత్తరాంధ్ర నాయకులు సకలాభక్తుల ప్రసాదరావు, తంగుడు నాగేశ్వరరావు, పి.వి.మల్లా గుప్తా, ఎరుకోల వెంకటరావు, తండుగు జోగారావు, యుగంధర్, తాళాసు సాయిమోహన్, కొంచాడ రాజాశ్రీకాంత్, గుడ్ల శ్రీనివాసరావు, కింతలి తిరుమలకుమార్, పొట్నూరు సాయిప్రసాద్, పి.వి.సతీష్, సూరు సాయిరాం, అంధవరపు బాలకృష్ణలు మాట్లాడుతూ ఒక్కో కళింగవైశ్యుడు వంద మంది ఓటర్లని తయారు చేయగలిగేలా సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కాళింగ కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, వెలమ కుల రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్‌సెల్ జిల్లా అధ్యక్షుడు రౌతు శంకరరావు, కళింగవైశ్యకుల నాయకులు అంధవరపు రమేష్, బరాటం సంతోష్, వడ్డి ఉదయ్, గుడ్ల దామోదరరావు, ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.