
కాసులు కురిపిస్తున్న పీచు
యువత దృష్టి సారించాలి..
కర్లింగ్ పీచుకు డిమాండ్...
● టన్ను పీచు ధర రూ.10 వేలు నుంచి రూ.20 వేలు ● ఉద్దానం నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతులు ● కొబ్బరి పీచు, తాళ్లకు డిమాండ్
వజ్రపుకొత్తూరు: కోనసీమ తర్వాత కొబ్బరి చెట్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఉద్దానంలో ఉత్పత్తి అవుతున్న కొబ్బరిపీచుకు మంచి గిరాకీ ఉంటోంది. ఇక్కడి పరిశ్రమల్లో తయారైన పీచు, తాడు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు భారీ ఎత్తున ఎగుమతి అవుతోంది. పొరుగునే ఉన్న విజయనగరంతో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు వంటి రాష్ట్రాలకు పీచు, తాడు ఉత్పత్తులు పంపిస్తున్నారు. జిల్లాలో అటు రణస్థలం నుంచి ఇటు ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, మందస, సంతబొమ్మాళి, పలాస తదితర 29 మండలాల్లో 15 వరకు పీచు పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ రోజుకు 120 టన్నుల వరకు పీచు ఉత్పత్తి జరుగుతోంది.
తయారీ ఇలా..
జిల్లాలో 32,602 ఎకరాల్లో కొబ్బరి సాగు చేస్తుండగా నెలకు సరాసరి 32,60,000 కాయలు దిగుబడి వస్తున్నాయి. కొబ్బరికాయల డొక్కలు 30 శాతం వృథాగా పోతుండగా.. పరిశ్రమ నిర్వహకులు అవసరమైన డొక్కలను రైతుల నుంచి కొనుగోలు చేసి లారీలతో తరలిస్తున్నారు. వీటిని పరిశ్రమల్లో పెద్ద లాట్‌లుగా కట్టి పది, పదిహేను రోజులు నీటితో తడుపుతారు. అనంతరం డీసెండికేటర్‌లో కొబ్బరి డొక్కలు వేస్తే పీచులా మారుతుంది. దానిని ఎండబెట్టి ఎగుమతులకు సిద్ధం చేస్తారు. కర్లింగ్ పీచు కొనుగోలు చేసుకుని కర్లింగ్ మెషీన్‌ల ద్వారా రెండు రకాల తాడును తయారు చేస్తారు. ప్రస్తుతం పీచు ధర టన్ను రూ.10వేలు ఉంది. కర్లింగ్ పీచుకు రూ.20 వేలు ధర లబిస్తోంది. 2014 వరకు కొబ్బరి పీచును చైనాకు అధికంగా ఎగుమతి జరిగేది. ఐతే పరుపుల తయారీకి ఫోం అందుబాటులోకి రావడంతో పీచుకు డిమాండ్ తగ్గింది. దేశీయంగా మాత్రం వినియోగం పెరిగింది. వినాయకుడు, దేవీ విగ్రహాల తయారీలో దేశ వ్యాప్తంగా కొబ్బరి పీచునే వినియోగిస్తుండటంతో గిరాకీ పెరుగుతోంది.
బోట్లు, ఇటుకలు తయారీకిలోనూ..
ప్రధానంగా బోట్లు తయారీలో కొబ్బరి పీచు వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్, కొబ్బరి పీచును వినియోగించి బోట్లు రూపొందిస్తారు. విశాఖ, కాకినాడ, చైన్నె, ముంబై, కోల్‌కత్తా, కేరళ తదితర ప్రాంతాల్లో చేపల బోట్లతో పాటు రవాణా, టూరిజం బోట్ల తయారీలో కొబ్బరి పీచు వినియోగిస్తారు. పీచు తయారీలో పొట్టు కూడా వస్తుంది. దీనిని కంపోస్టు, ఇటుకల తయారీలో వినియోగిస్తున్నారు. ఫాక్టరీల వద్దే నేరుగా కంపోస్టు ఎరువు తయారు చేసి నర్సరీలకు ఎగుమతి చేస్తున్నారు. కంపోస్టు ఎరువు టన్ను రూ.5వేలు ధర పలుకుతోంది. ఇటుకల బట్టీల్లోనూ పొట్టు వినియోగిస్తున్నారు. దీని వల్ల ఇటుక తేలికగా ఉంటోంది. ఈ ఇటుక అపార్టుమెంట్ల నిర్మాణంలో బాగా ఉపయోగపడుతోంది. ట్రాక్టర్ లోడుకు రూ.7వేలు ధర లభిస్తోంది.
ఉద్దానం ప్రాంతంలో పెద్ద ఎత్తున కొబ్బరి డొక్కలు ఉత్పత్తి అవుతున్నా అందుకు తగ్గస్థాయిలో పరిశ్రమలు లేవు. ఔత్సాహికులు ముందుకు వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కాయిర్ బోర్డు ద్వారా 35 శాతం సబ్సిడీతో రుణాలు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగ యువత ఈ పరిశ్రమలపై దృష్టి సారించాలి. ఇచ్చాపురం కొబ్బరి పొట్టుతో ఇటుకలు తయారు చేసే పరిశ్రమ సైతం ఉంది. మంచి లాభాలు సైతం ఆర్జిస్తున్నారు. కాయిర్ బోర్డు, మా సహకారం తీసుకుని ముందుగా దీనిపై అవగాహన పెంచుకుని నాబార్డు, ఇతర సంస్థలు ద్వారా రుణాలు పొంది పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలి.
– సీహెచ్.శంకర్‌దాసు,
ఉద్యానవన శాఖ అధికారి , పలాస
ఇటీవలే పీచు పరిశ్రమ ప్రారంభించాను. కర్లింగ్ పీచుకు డిమాండ్ ఉంది. అయితే మార్కెట్‌పై పూర్తి స్థాయిలో అవగాహన లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాయిర్ బోర్డుపీచు పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి మార్కెట్ సౌకర్యం మార్గాలను చూపించాలి. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇవ్వాలి.
– కె.దేవదాసు, పీచు పరిశ్రమ నిర్వాహకుడు, పెద్దమురహరిపురం

కాసులు కురిపిస్తున్న పీచు

కాసులు కురిపిస్తున్న పీచు

కాసులు కురిపిస్తున్న పీచు

కాసులు కురిపిస్తున్న పీచు