
డిజిటల్ మారథాన్‌కు రెడీ
బహుమతులు, సర్టిఫికెట్లు..
గొప్ప అవకాశం..
ప్రతిభ నిరూపించుకోవాలి..
● ‘ఆంధ్రా యువ అంబాసిడర్’ ఎంపికలకు పోటీలు ● షార్ట్‌వీడియోలకు ఆహ్వానం ● విజేతలకు భారీగా నగదు బహుమతులు
శ్రీకాకుళం న్యూకాలనీ :
వికసిత్ భారత్ – 2047 లక్ష్యాలను సాధించేలా యువతను ఆకర్షించేందుకు యువజన సర్వీసుల శాఖ నడుంబిగించింది. దీనిలో భాగంగా సామాజిక, కుటుంబ సంబంధాలతోపాటు ఆరోగ్యకరమైన జీవన వైవిధ్యాన్ని తెలియజేస్తూ డిజిటల్ ఆవిష్కరణల విలువలను ప్రోత్సహించి ప్రజలను మేల్కొలిపేలా షార్ట్‌వీడియోను తయారుచేసేందుకు యువతకు అవకాశం కల్పించారు. ఇందులో విజేతలకు ఆంధ్ర యువత అంబాసిడర్‌గా ప్రకటించడంతో పాటు భారీగా నగదు ప్రోత్సాహకాలను అందజేయనున్నారు. ఈ మేరకు ‘ఆంధ్ర యువ సంకల్ప్ 2కే25 (ఆంధ్ర యువ 2కే25 అంబాసిడర్)’ డిజిటల్ మారథాన్‌లో యువత భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిస్తున్నారు.
ఎలా పాల్గొనాలంటే..
● ఆంధ్ర యువ అంబాసిడర్ పోటీల్లో పాల్గొనేందుకు 18 నుంచి 35 ఏళ్ల యువతీ యువకులు అర్హులు.
● ‘ఆంధ్రాయువసంకల్ప్.కామ్’ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేరుకోవాలి. ఇందుకు ఈ నెల 15తో గడువు ముగియనుంది.
● పోటీల్లో పాల్గొనేవారు 120 సెకన్ల నిడివిగల వీడియో/షార్ట్‌ను తయారుచేసి, నిర్దేశిత అధికారిక హ్యాష్‌ట్యాగ్‌లతో వారి సొంత సోషల్ మీడియా ఖాతాలలో (ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ షార్ట్స్ మొదలైనవి) పోస్ట్ చేయాలి.
● జ్యూరీ కమిటీ తమకు వచ్చిన ఎంట్రీలను సమీక్షించి విజేతలను ప్రకటిస్తుంది.
అంబాసిడర్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచినవారికి రూ.1,00,000, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ.75,000, తృతీయ స్థానంలో నిలిచినవారికి రూ.50,000 నగదు బహుమతులు అందజేస్తారు. మొదటి తొమ్మిది మంది విజేతలకు ‘ఆంధ్ర యువ సంకల్ప్ 2కే25 అంబాసిడర్‘గా గౌరవ సత్కారం అందజేస్తారు. పోటీలలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ డిజిటల్ క్రియేటర్ ఏపీ 2కే25 పేరిట సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు.
యువత తమలో ఉండే సృజనాత్మకతను నిరూపించుకునేందుకు చక్కటి అవకాశం. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా వివిధ అంశాల్లో ప్రజలను మేల్కొలిపేలా వీడియోను సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేయాలి. రిజిస్ట్రేసన్ చేసుకున్నవారి వీడియోలను జ్యూరీ కమిటీ పరిశీలించి ఎంపికచేస్తుంది.
– వావిలపల్లి వెంకటప్పలనాయుడు, సెట్‌శ్రీ సీఈఓ
జిల్లా యువత అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. టాలెంట్ నిరూపించుకునేందుకు ఇదొక చక్కటి అవకాశం. డిజిటల్ మారథాన్‌లో పాల్గొని ప్రతిభ చాటుకోవాలి. అత్యధిక మంది భాగస్వాములై శ్రీకాకుళం జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలి.
– కె.వెంకట్ ఉజ్వల్,
మేరాభారత్ డిప్యూటీ డైరెక్టర్