
పంచాయతీలపై బకాయిల పిడుగు
● ఆరేళ్ల కిందటి బకాయిలు చెల్లించాలని నోటీసులు
● ఇబ్బందులు పడుతున్న పంచాయతీ పాలకులు
సోంపేట:
సచివాలయాలతో మొదలుపెట్టి స్థానిక పాలనను నిర్వీర్యం చేస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం కన్ను ఇప్పుడు పంచాయతీలపై పడింది. ఇప్పటికే నిధుల లేమితో ఇబ్బంది పడుతున్న పంచాయతీల నెత్తిన సర్కారు పిడుగు వేసింది. 2016 నుంచి 2019 కాలంలో ఈఈఎస్‌ఎల్ సంస్థకు బకాయి ఉన్న విద్యుత్ బల్బుల నిర్వహణ నిధులు చెల్లించాలని మండల అధికారులకు నోటీసులు జారీ చేశారు. 2024 ఆగస్టు నుంచి సెప్టెంబరు 2025 వరకు ఒక్క రూపాయి కూడా పంచాయతీల్లో కూటమి ప్రభుత్వం నిధు లు జమచేయలేదు. అయితే సెప్టెంబరు 2025 లో మండలంలోని 23 పంచాయతీలకు సుమారు రూ.1.50 కోట్లు నిధులు జమ చేసింది. దీంతో ఆ నిధులు ఎటూ చాలక పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. క్లాప్ మిత్ర వేతనాలు, విద్యుత్ బల్బుల నిర్వహణ, తాగునీటి పథకాల నిర్వహణ, పారిశుద్ధ్యం గత ఏడాదిగా చేసిన పనులకు ఆ బిల్లులు సరిపోలేదు. దీంతో ప్రస్తుతం పంచాయతీలు నిధులు లేక ఖాళీగా ఉన్నాయి.
బకాయిలు చెల్లించాలని నోటీసులు
2016 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో పంచాయతీల్లో విద్యుత్ బల్బుల నిర్వహణ చేపట్టాలని ఈఈఎస్‌ఎల్ సంస్థకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. అప్పట్లో ఆ సంస్థ విద్యుత్ బల్బుల నిర్వహణ చేపట్టింది. కానీ అప్పట్లో ఆ సంస్థకు బకాయిలు చెల్లించలేదు. ఆ బకాయిలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం రావడంతో ఈఈఎస్‌ఎల్ సంస్థ తమ బకాయిల గురించి ప్రభుత్వాన్ని అడిగింది. దీంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు అప్పటి బకాయిలు ఇప్పుడు చెల్లించాలని పంచాయతీలకు మండలస్థాయి అధికారులు గత నె ల రోజులుగా నోటీసులు అందజేస్తున్నారు. కానీ పంచాయతీ సర్పంచ్‌లు బకాయిలు చెల్లించడానికి ససేమిరా అంటున్నారు. అప్పటి బకాయిలు ఇప్పుడు ఎలా చెల్లిస్తామని ప్రశ్నిస్తున్నారు.
సుమారు కోటి యాభైలక్షల రూపాయల నిధులు పంచాయతీ ఖాతాల్లో జమచేసి ప్రస్తుతం రూ.60 లక్షల నిధులు చెల్లించాలని సోంపేట మండలంలో 23 పంచాయతీలకు నోటీసులు అందజేశారు. దీంతో సగం నిధులు బకాయిలు చెల్లించడానికి, మరో సగం నిధులు సెస్ చార్జీలు చెల్లించడానికి సరిపోతాయని వాపోతున్నారు. ఇలా నిధులన్నీ అయిపోతే పంచాయతీల్లో అభివృద్ధి పనులెలా అని ప్రశ్నిస్తున్నారు.
ఇబ్బంది పెడుతున్నారు
పంచాయతీల్లో అప్పులు చేసి పనులు చేస్తున్నాం. ఇప్పుడు కొంత నిధులు ఇచ్చి పాత బకాయిలు చెల్లించమని నోటీసులు అందజేస్తున్నారు. పంచాయతీ సర్పంచ్‌లను ఇబ్బందులకు గురిచేయడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.
– పాతిన శేషగిరి, మామిడి పల్లి సర్పంచ్
పాతబకాయిలు చెల్లించాలి
2016–19 మధ్య కాలంలో ఈఈఎస్‌ఎల్ సంస్థ పంచాయతీల్లో విద్యుత్ బల్బులు నిర్వహణ చేపట్టింది. నేడు కేవలం విద్యుత్ బల్బులు వేసిన ఖర్చులు మాత్రమే సంస్థ అడుగుతోంది. పంచాయతీ సర్పంచ్‌లు సహకరించి బకాయిలు చెల్లించాలి.
– సీహెచ్ ఈశ్వరమ్మ, ఎంపీడీఓ
బకాయిలు చెల్లించాలనడం దారుణం
కూటమి ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన లేదు. పంచాయతీలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. కూటమి పాలనలో పంచాయతీలకు నిధులు లేక సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పడు కొంత జమ చేసి పాత బకాయిలు చెల్లించమనడం దారుణం.
– శిలగాన భాస్కరరావు, సుంకిడి సర్పంచ్

పంచాయతీలపై బకాయిల పిడుగు

పంచాయతీలపై బకాయిల పిడుగు

పంచాయతీలపై బకాయిల పిడుగు

పంచాయతీలపై బకాయిల పిడుగు