
ఇచ్చిన మాట నిలబెట్టుకోరూ.. !
● డిప్యూటీ సీఎం సారూ..
● విద్యార్థి కుటుంబసభ్యుల విజ్ఞప్తి
వజ్రపుకొత్తూరు రూరల్: అధికారం కోసం కూటమి నాయకులు ఎన్నికల సమయంలో విద్యార్థుల చావులతోనూ రాజకీయం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని వేదికల మీద ఊదరగొట్టే ప్రసంగాలు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం చాటేశారు. శ్రీకాకుళం జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన నువ్వలరేవుకు చెందిన మువ్వల నగేష్ ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద ఉన్న శివాని ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతూ 2021 జనవరి 26న అనూమానాస్పదంగా మృతి చెందాడు. తమ కుమారుడిని కాలేజీలోనే ఎవరో చంపి మృతదేహాన్ని కాల్చే ప్రయత్నం చేశారని, పోస్టుమార్టం చేసినా రిపోర్టు ఇవ్వలేదని, కేసును సైతం తారుమారు చేశారని కుటుంబ సభ్యులు అప్పట్లో ఆందోళనకు దిగారు. ఈ విషయమై ఎన్నికల సమయంలో రణస్థలం వద్ద నిర్వహించిన యువశక్తి కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పలాసలో జరిగిన యువగళం కార్యక్రమంలో టీడీపీ నేత నారా లోకేశ్ కూడా మనం అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే దోషులను శిక్షిస్తామని, బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక విస్మరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం విలేకర్ల ముందు తమ గోడు వెల్లబోసుకున్నారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను మూడుసార్లు కలిశామని, తాను ఈ విషయంలో ఏమీ చేయలేనంటూ ఎంపీ రామ్మోహన్‌నాయుడిని గానీ మంత్రి అచ్చెన్నాయుడిని గానీ కలవండి అంటూ తప్పించుకున్నారని వాపోయారు. ఇప్పటికైనా నిందితులను శిక్షించి న్యాయం చేయాలని కోరారు.