
తగ్గేదేలే!
మడపాం దగ్గర నదిలో తవ్వకాలు
వానొచ్చినా..
వరదొచ్చినా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇసుకాసురాలు వెనక్కి తగ్గడం లేదు. వానలు పడుతున్నా, వరద వచ్చినా లెక్క చేయడం లేదు. కోట్ల రూపాయలు రుచిమరి గిన అక్రమార్కులు ఇసుక దోపిడీ చేస్తునే ఉన్నారు. ప్రభుత్వమే తమకు లైసెన్సు ఇచ్చినట్టుగా ఇసుక దందా సాగిస్తున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వర్షాలు పడుతున్నా, నాగావళి, వంశధార, బహుదా, మహేంద్రతనయా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నా కూడా అక్రమ తవ్వకాలు, రవాణా ఆగడం లేదు. ప్రధానంగా శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలస, నరసన్నపేట, పాతపట్నం, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ బాగోతం నడుస్తోంది. అక్కడి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో, అనుచరులు దగ్గరుండి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. అనుచరులతో పాటు బాబాయ్ అబ్బాయ్ అనుచరులు అక్రమ ఇసుక దందాతో లబ్ధి పొందుతున్నారు. పట్టపగలు, బహిరంగంగా ఇసుక పేరుతో లూఠీ చేసేస్తున్నారు. అనధికార రీచ్‌ల్లోనే కాదు అధికారిక రీచ్‌ల్లో కూడా చొరబడి ఇసుక మింగేస్తున్నారు. వంశధార, నాగావళి నదులు అక్రమ సంపాదనకు ఆనవాళ్లుగా మారుతుండడం విశేషం.
అక్రమాల జాడలివిగో..
● శ్రీకాకుళం రూరల్ పరిధిలోని భైరి, కరజాడ, కళ్లేపల్లి, కిల్లిపాలెం, లొద్దలపేట, సింగూరు, నైరాతో పాటు పొన్నాం నుంచి రాత్రిపూట పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతోంది. తెల్లవారయ్యేసరికి తమ పని కానిచ్చేస్తున్నారు. ప్రజలు నిద్రలేచే లోపు దందా ముగించేస్తున్నారు. ఒక్కొక్క లారీకి రూ.35వేలకు పైగా వసూలు చేసి అప్పనంగా సంపాదిస్తున్నారు.
● ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో రెండు నదుల్లోనూ ఇసుక దందా కొనసాగుతోంది. ముద్దాడపేట, పురుషోత్తపురం, కొత్తవలస, నిమ్మతొర్లాడ, దూసి, తోటాడ, అక్కివరం, తొగరాం, బెలమం, పొందూరు మండలం సింగూరు, బొడ్డేపల్లి, నెల్లిమెట్టలో సైతం ఇదే రకంగా ఇసుక దోపిడీ జరుగుతోంది. బూర్జ మండలం కాఖండ్యాం, నారాయణపురం, సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం, పాతపాడులో అక్రమంగా తవ్వి తరలించేస్తున్నారు.
● నరసన్నపేటనియోజకవర్గ పరిధిలోని మడపాం, లుకలాం, బుచ్చిపేట, చెవ్వాకులపేట, పర్లాంలో భారీగా ఇసుక తరలిపోతోంది. అధికార పార్టీ నాయకులు దర్జాగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఒక్కొక్క లారీకి రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకూ వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పొన్నాడ, తోటపాలెంలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతోంది.
● పాతపట్నం నియోజకవర్గంలో వసప, బలద, ఆకులతంపర, హిరమండలంలో కోరాడ, భగీరథిపురం, రెల్లివలస, అక్కరాపల్లి, పిండ్రువాడలో ఇసుక దందా కొనసాగుతోంది.
నదుల్లో వరదనీరు ప్రవహిస్తున్నా తగ్గని
ఇసుకాసురులు
ఆమదాలవలస, శ్రీకాకుళం, నరసన్నపేట, పాతపట్నంలో యథేచ్ఛగా దందా
లారీలు పట్టుకుంటే వదిలేయాలని
ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు
చూసీచూడనట్టుగా అధికార యంత్రాంగం

తగ్గేదేలే!