
బాలింత మృతిపై ఆందోళన
● రిమ్స్ వైద్య సిబ్బందిపై కుటుంబ సభ్యుల ఆరోపణ ● అలికాం – బత్తిలి రహదారిపై నిరసన
హిరమండలం: రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందని ఎల్‌ఎన్‌పేట మండలంలోని స్కాట్‌పేట గ్రామస్తులు అలికాం – బత్తిలి ప్రధా న రహదారిపై మృతదేహంతో గురువారం నిరసన తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఎల్‌ఎన్‌పేట మండలం స్కాట్‌పేట గ్రామానికి చెందిన తొగరాపు లోచన (21)కు నెలలు నిండడంతో ప్రసవం కోసం భర్త ఉదయ్‌కుమార్ ఈనెల 22వ తేదీన శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడున్న సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు. సుఖ ప్రసవం కోసం వేచి చూద్దామంటూ చెప్పుకొచ్చారు. ఆ మరుసటి రోజు మంగళవారం పురిటి నొప్పులు తీవ్రతరం కావడంతో అక్కడున్న వైద్యులు ఆపరేషన్ చేసి ప్రసవం చేశారు. లోచన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే బుధవారం నాటికి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. కేజీహెచ్‌కు తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు
వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని నేరుగా స్వగ్రామం స్కాట్‌పేటకు బుధవారం రాత్రి తీసుకొచ్చారు. అయితే రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యంతోనే లోచన చనిపోయిందంటూ కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తూ అలికాం–బత్తిలి రహదారిపై గురువారం మృతదేహంతో ఆందోళనకు దిగారు. సరుబుజ్జిలి ఎస్‌ఐ హైమావతి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులకు నచ్చజెప్పారు. పోస్టుమార్టంకు పంపితే అసలు విషయం తెలుస్తుందని చెప్పారు. కానీ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా మృతురాలి లోచనకు రెండేళ్ల కుమారుడు, భర్త ఉదయ్‌కుమార్ ఉన్నారు. పసికందును చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

బాలింత మృతిపై ఆందోళన