
భార్య మోసం చేసిందని..
● కుమార్తెతో కలిసి గడ్డిమందు తాగిన తండ్రి ● చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి ● సంచాం గ్రామంలో విషాదం
రణస్థలం : భార్య మోసం చేసిందనే ఆవేదన తో కుమార్తెకు గడ్డిమందు తాగించి తాను కూ డా అదే గడ్డిమందు తాగిన ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన రణస్థ లం మండలం మండలం సంచాం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, జే.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంచాం గ్రామానికి చెందిన దుప్పాడ సంతోష్(35) అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య అనూకు ఇద్దరు కుమారులు, రెండో భార్య స్వాతికి ఒక కుమార్తె ఉన్నారు. సంతోష్ కారు డ్రైవింగ్ చేస్తూ రెండు ఇళ్లు తీసుకుని ఇద్దరు భార్యలతో పాటు విశాఖపట్నంలోనే నివాసం ఉంటున్నాడు. కుమార్తె హైమవతి శ్రీకాకుళం సమీపంలోని పెద్దపాడు గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. దసరా సెలవులు కావడంతో హైమవతిని ఈ నెల 20న తీసుకురమ్మని రెండో భార్య స్వాతిని సంతోష్ పంపించాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు..
స్వాతి విశాఖపట్నం నుంచి వస్తూ అప్పటికే సంచాంలో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉండడంతో అతని వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. స్వాతి అదే రోజు రాత్రి కుమార్తెతో కలిసి విశాఖలోని ఇంటికి వెళ్లినప్పటికే ఇన్‌స్టాలో ఫొటోలు చూసిన సంతోష్ ఆమెతో గొడవ పడ్డాడు. ఈ నెల 21న కుమార్తె హైమవతితో పాటు రెండో భార్య స్వాతితో కలిసి స్వాతి కన్నవారైన జీరుపాలెం గ్రామానికి వెళ్లి, అక్కడ పెద్దల సమక్షంలో అప్పగించి తిరిగి విశాఖపట్నం వెళ్లిపోయాడు. మరలా ఈ నెల 24న జీరుపాలెం వెళ్లి కుమార్తెను వెంటబెట్టుకుని తన స్వగ్రామం సంచాం వచ్చాడు. సంచాం కొండ సమీపంలోని తోటలో హైమవతికి గడ్డిమందు తాగించి, తానూ తాగి మేము చనిపోతున్నామని వీడియో కాల్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. చావుబతుకుల మధ్య ఉన్న ఇద్దరినీ కుటుంబ సభ్యులు తొలుత రణస్థలం సీహెచ్‌సీ తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఇద్దరూ మృతి చెందారు. మృతుడి తండ్రి దుప్పాడ సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి తెలిపారు.