
మాజీ సీఎంను దూషించడం సరికాదు
నరసన్నపేట : ప్రజా సేవకుడిగా..ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ మోహనరెడ్డిని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా సంస్కార హీనంగా మాట్లాడటాన్ని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ గురువారం తీవ్రంగా ఖండించారు. సినీ నటుడిగా తాను నటించిన సినిమాల్లో హిత బోధలు చేస్తూ గొప్పలు చెప్పుకొనే వ్యక్తి నిజ జీవితంలో అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని ఉద్దేశించి సైకో అని మాట్లాడాన్ని తప్పుపట్టారు. సినీ నటులను తాడేపల్లికి పిలిచి వైఎస్ జగన్ అవమానించారనడం అవాస్తవమన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ సినీ పరిశ్రమకు అండగానే ఉన్నారని గుర్తు చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మహిళలకు జాబ్‌మేళా రేపు
శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లా కేంద్రంలో బలగ హాస్పిటల్ జంక్షన్‌లో ఉన్న పారిశ్రామిక శిక్షణా సంస్థ/డీఎల్‌టీసీ వద్ద ఈ నెల 27న మహిళలకు జాబ్‌మేళా జరగనుందని అసిస్టెంట్ డైరెక్టర్ వై.రామ్‌మోహనరావు గురువారం తెలిపారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్‌లో టీఏఎస్‌ఎల్ ఏరోస్ట్రక్చర్స్, ఏరో ఇంజినీర్స్ సంస్థ పేరిట ఫీమేల్ ట్రెయినీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన కనీసం పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ధ్రువపత్రాలతో శనివారం ఉదయం 9 గంటలకు డీఎల్‌టీసీ ప్రాంగణం వద్దకు చేరుకోవాలని సూచించారు.
మండపల్లి సర్పంచ్ చెక్ పవర్ పునరుద్ధరణ
ఇచ్ఛాపురం రూరల్ : గత వైఎస్సార్‌సీపీ హయాంలో పంచాయతీ అభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకురాలు పిట్ట శేషమ్మపై కూటమి ప్రభుత్వం కక్షగట్టి ఈ ఏడాది ఫిబ్రవరి 13న చెక్ పవర్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆమె కోర్టు ద్వారా పోరాటం చేసిన నేపథ్యంలో గురువారం చెక్ పవర్‌ను పునరుద్ధరిస్తూ జిల్లా పంచాయతీ అధికారి కె.భారతి సౌజన్య ఉత్తర్వుల మేరకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కె.రామారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ న్యాయం గెలిచిందని, పంచాయతీ అభివృద్ధికి కృషి చేసిన తనను మానసికంగా వేధించారని, అయినప్పటికీ ప్రజల శ్రేయస్సు కోసం పోరాటం చేసి విజయం సాధించానని చెప్పారు.