
30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలి
రణస్థలం: 12వ పీఆర్‌సీ కమిషన్ నియమించి, దసరా కానుకగా 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా సభ్యత్వ అభియాన్‌లో భాగంగా మంగళవారం రణస్థలం మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించాలన్నారు. జిల్లా పూర్వ అధ్యక్షుడు జి.వెంకటగిరి మాట్లాడుతూ కాంప్లెక్స్ స్థానాల్లో పని చేస్తున్న గణిత, ఆంగ్ల ఉపాధ్యాయులకు, శాశ్వత స్థానాలు కేటాయించే ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి రవి భట్టు మాట్లాడుతూ జూన్‌లో బదిలీలు పొంది రిలీవర్ లేని కారణంగా అదే స్థానాల్లో ఉన్న ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించేలా తాజా డీఎస్సీ అభ్యర్థులను నియమించాలన్నారు. కార్యక్రమంలో సంఘ మండల అధ్యక్షుడు జి.చిన్ని కృష్ణంనాయుడు, ప్రధాన కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.