
దళిత కార్మికుల పొట్ట కొట్టొద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్: టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు చేసి ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోకు భూములిచ్చిన దళిత కార్మికుల పొట్టకొట్టవద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు కోరారు. ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కలిలో మరో మద్యం డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల ఉపాధిని కాపాడాలని కోరుతూ మంగళవారం ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో కార్మికులు, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాకుళం ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు. వీరికి సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.వి.రమణ, పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో కొత్తగా టెక్కలిలో మరో డిపో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజలు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీరు అడుగుతున్నారు తప్ప బీరు అడగడం లేదని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో హమాలీ యూనియన్ ప్రధాన కార్యదర్శి డి.బంగార్రాజు, నాయకులు టి.రామారావు, ఎన్.సురేష్, ఎన్.రమణ, బోనెల.రాము, పి.రామారావు, ఎల్.సీతారాం, ముద్దాడ.రాజు, కె.వి రమణ, ఎస్.శ్రీను తదితరులు పాల్గొన్నారు.