
థర్మల్ పవర్ ప్లాంట్‌పై కావాలనే రభస
బూర్జ: నియోజకవర్గం అభివృద్ధికి సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ తెస్తే కొందరు కావాలనే రభస చేస్తున్నారని ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కర్నేన దీప అధ్యక్షతన సాధారాణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడ నిర్మాణం చేపడతారో తెలియక ఆదివాసీలను రెచ్చ గొట్టి ప్రతి రోజు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి సర్వే కూడా చేయకుండా అడ్డుకుంటున్నారు చెప్పారు. పవర్ ప్లాంట్‌తో సుమారు 10 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. అనంతరం విద్యాశాఖపై సమీక్షిస్తూ.. మండల ఎంఈఓలు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించడం లేదని, ఎంఈఓ శ్యామసుందరరావు సమావేశానికి డుమ్మా కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమో అందజేయాలన్నారు. ఎంఈఓల నిర్వాహకం వల్లే అల్లేన గ్రామంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జీవోకు విరుద్ధంగా 14 కి.మీ దూరంలో ఉన్న పాలవలస పాఠశాలలో విలీనం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంఈఓలు సెలవులపై వెల్లాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ ఆర్.తిరుపతిరావు, తహసీల్దార్ వై.వి.పద్మావతి, ఏపీ మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణనాయుడు, వైస్ ఎంపీపీలు కరణం కృష్ణమూర్తి నాయుడు, బుడుమూరు సూర్యారావు, పీఏసీఎస్ అధ్యక్షుడు బగాది శ్రీరామ్మూర్తినాయుడు పాల్గొన్నారు.