
పక్కా చీటింగ్
అసలే ఎరువులు తక్కువ. ఇస్తున్న చీటీలు ఎక్కువ. ఎంతమందికని ఇవ్వగలం. నాయకులు, డిపార్ట్‌మెంట్ ఒత్తిళ్లు ఉన్నాయి. వ్యాపారులం ఏం చేయగలం. ఎవరిని ఏం అనలేకపోతున్నాం.
– ప్రైవేటు ఎరువుల వ్యాపారి గోడు
మొన్నటి వరకు యూరియా కోసం ఒత్తిడి చేసేవారు. దాచి ఇవ్వాలని ఆదేశించేవారు. ఇవ్వకపోతే బెదిరించేవారు. మాట వినకపోతే కక్ష సాధించేవారు. ఇప్పుడే మో స్లిప్పుల కోసం ఒత్తిడి చేస్తున్నారు. తమ వారికే స్లిప్పులు ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. ఒక్కో స్లిప్పులో చెప్పినన్ని బస్తాలు రాయాలని ఒత్తిళ్లు పడలేకపోతున్నాం.
– విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ల మనోవేదనిది
జగన్ ఉన్నప్పుడు బాగానే ఇచ్చారు. సెక్రటరీలు తెచ్చేవారు. కార్డులు ఒట్టుకెళ్లి విడిపించుకునేవారిమి. ఇప్పుడు జనాల్ని తినేస్తున్నాడు బాబు. రోడ్డు పాలు చేస్తున్నాడు. అంబలి, గంజి లేకుండా చచ్చిపోతున్నాం. స్లిప్పులు తెమ్మంటున్నారు. స్లిప్పు లు తేనిచ్చి.. లైన్లలో తోసేస్తున్నారు.
– ఓ మహిళా రైతు ఆవేదన ఇది
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
యూరియా పంపిణీలో అధికా రికంగానే ‘చీటి’ంగ్ జరుగుతోంది. ఎరువుల కోసం ముందస్తుగా పంపిణీ చేస్తున్న చీటీలను తమ వారికే ఇచ్చేలా అధికార పార్టీ నాయకులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వీరి ఒత్తిళ్లు పడలేక సచివాలయ సిబ్బంది వేదనకు గురవుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులందరికీ యూరి యా దొరికేది. ఈ–క్రాప్‌లో వివరాలు నమోదు చేసుకుని దాని ప్రకారం ఎరువులు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ–క్రాప్ జరగడం లేదు. సాగుపై ఎవరికీ కనీస అంచనా కూడా లేదు. దీంతో కూటమి ప్రభుత్వంలో యూరియా బస్తా దొరికితే చాలు అదే పదివేలు అన్న చందంగా పరిస్థితి మారింది.
ఆర్‌ఎస్‌కేల్లో, పీఏసీఎస్‌లలో అధికార పార్టీ నాయకులే యూరియా బస్తాలు పట్టుకుపోతున్నా రని ఏకంగా విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లే(వీఏఏ) వాపోతున్నారు. ఉద్యోగులే రోడ్డెక్కడంతో కలెక్టర్ ఆధ్వర్యంలో కొత్తరకమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రైతు సేవాకేంద్రాలు, ప్రైవేటు దుకాణాలకు వచ్చిన యూరియాను నేరుగా అమ్మకుండా తహసీల్దార్, వ్యవసాయ శాఖాధికారి సంయుక్తంగా సంతకాలు చేసిన చీటీలను పట్టుకెళితేనే యూరి యా ఇవ్వాలని అటు రైతు సేవా కేంద్రాలకు, ఇటు డీలర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఆ చీటీలను పంపిణీ చేసే బాధ్యత సచివాలయాల్లో వీఏఏలకు అప్పగించారు.
మళ్లీ అదే పరిస్థితి
విధానం మార్చినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఈ చీటీలను తమవారికే ఇచ్చేలా టీడీపీ నాయకులు ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నారు. నచ్చినంత యూరియా కావాలని రాయించుకుంటున్నారు. ముఖ్యంగా సాగు చేయని వారు, కౌలుకు ఇచ్చిన రైతుల పేర్లతో చీటీలను రాయించుకుంటున్నారు. అంతేకాకుండా ఒకే ఇంట్లో ఉన్న నలుగురైదుగురిపైన కూడా రాయించుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీఏఏల దగ్గర చీటీలు రాయించుకోవడమే కాకుండా తమ వాళ్లు తీసుకొచ్చిన చీటీలకే ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాపారులపై కూడా ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో సామాన్య రైతుల కు యూరియా దొరకడం గగనమైపోయింది.
ఇరకాటంలో వ్యవసాయశాఖ సిబ్బంది..
అటు కూటమి నాయకుల ఒత్తిళ్లకు తట్టుకోలేక, ఇ టు అన్నదాతల బాధలు చూడలేక వ్యవసాయశాఖ సిబ్బంది ఇరకాటంలో పడ్డారు. మనకెందుకులే అని కొంతమంది వీఏఏలు వచ్చినవారందరికీ సీట్లు ఇ చ్చి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ప్రైవేటు వర్తకుల వద్ద చీటీలు ఎక్కువ, యూరియా తక్కువ అన్నట్లు ఉంది పరిస్థితి. అక్కడ కూడా మళ్లీ అధికార పార్టీ నాయకులే చీటీలు చూపించి యూరియాను కొట్టేస్తున్నారు.
చిలక్కొట్టుడు..
మే, జూన్, జూలై నెలల్లో ప్రైవేటు డీలర్ల దగ్గర యూరియా కొనుగోలు చేసిన రైతుల వివరాలు వీఏఏల వద్ద లేవు. దీంతో చాలా మంది మళ్లీ యూరియా కోసం వస్తున్నారు. దీనికి తోడు అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారం చీటీలను పట్టుకెళ్లిపోతున్నారు. ఈ చీటీలతో ప్రైవేటు డీలరు వద్ద ఎంఆర్‌పీ ధరకే యూరియా బస్తాలు కొట్టేసి బ్లాక్‌లో రూ.400, రూ.500అంతకంటే ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల గ్రామాల్లో దళారీలకు అప్పగించి బహిరంగంగానే అధిక ధరలకు యూరియా అమ్మకాలు చేపట్టిన సందర్భాలపై రైతులు అనేక ఆరోపణలు చేస్తున్నారు.
తెలుగు తమ్ముళ్ల చేతికే యూరియా చీటీలు
కొనసాగుతున్న మరో అధికారిక దోపిడీ
వీఏఏలపై ఆగని ఒత్తిళ్లు
తమ వాళ్లకే చీటీలు ఇవ్వాలని అధికార పార్టీ నాయకుల హుకుం

పక్కా చీటింగ్

పక్కా చీటింగ్