
‘ప్రైవేటుపరం చేయడమే అభివృద్ధా..?’
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని అందించాలనే సంకల్పంతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువస్తే వాటిని ప్రైవేటుపరం చేయడం అన్యాయమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ డాక్టర్స్ సెల్ వింగ్ అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 1923 వైజాగ్ ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటు మొదలుకుని 2024 పాడేరులో మెడికల్ కాలేజీ నిర్మాణం వరకు ఒక్క సీటు, ఒక్క కాలేజీని కూడా చంద్రబాబు తీసుకురాలేదని గుర్తు చేశారు. కాన్నీ అన్నీ తానే తెచ్చినట్లు భజన బృందం చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. పీపీపీ మోడ్ అంటే ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడమేనని వివరించారు. చంద్రబాబుకు ప్రతిదాన్ని ప్రైవేటుకు అప్పగించేయాలన్న ఆలోచన తప్ప ప్రజలకు మంచిచేసే ఆలోచన లేదని దుయ్యబట్టారు. ఇన్ని జరుగుతున్నా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మౌనంగా ఉండిపోవడం తగదన్నారు. ఈ 15 నెలల్లో రాష్ట్రంలో ఉల్లి, టమాటా, మామిడి, పొగాకు రైతులు రోడ్డున పడ్డారన్నారు. పోర్టులు, స్కూల్స్‌ని పూర్తి చేయాలన్న మనసు లేని మనుషులు కూటమి నేతలని మండిపడ్డారు. ఇదే మాదిరిగా పాలన సాగిస్తే వైఎస్సార్‌సీపీ ఎలాంటి పోరాటాలకై నా వెనకడుగు వేయదని అన్నారు.
నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విజిలెన్స్ ఆరా
అరసవల్లి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కీలకమైన డెమో విభాగంపై విజిలెన్స్ దృష్టి సారించింది. మంగళవారం సాక్షిలో ప్రచురితమైన ‘తినేస్తున్నాడెమో’ అన్న కథనంపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. ప్రచార విభాగానికి సంబంధించి ప్రభుత్వ నిధుల దుర్వినియోగం పై తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో వైద్య ఆరోగ్యశాఖ లో డెమో విభాగ అధికారులతో పాటు కీలక అధికారి కూడా అప్రమత్తమయ్యారని తెలు స్తోంది. విజిలెన్స్ రంగ ప్రవేశం అనంతరం నిధులు బుక్కేసినవారిపై ఉద్యోగుల్లో సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవ శకటం, పలు దినోత్సవాలు, వారోత్సవా ల ప్రచార ఫైల్స్‌లో మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అందరి సహకారంతో కొత్తమ్మతల్లి శతాబ్ది ఉత్సవాలు
టెక్కలి: అందరి సహకారంతో కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేద్దామని టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి కోరారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో మహిళలు, పురుషుల కబడ్డి పోటీలు, ప్రత్యేకంగా హెలీ రైడ్, కొత్తమ్మతల్లి విశిష్టత పై లేజర్ షోతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 24న కొత్తపేట జంక్షన్ నుంచి శోభయాత్ర ఉంటుందని పేర్కొన్నారు. వారణాశిలో హారతి ఇచ్చే విధంగా అమ్మవారికి హారతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కలెక్టరేట్ వద్ద ఏపీటీఎఫ్ ఆందోళన
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోలేదని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు, వేతన సవరణలు, కరువు భత్యం మంజూరు జరగడం లేదన్నారు. డీఏ, పీఆర్‌సీ పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

‘ప్రైవేటుపరం చేయడమే అభివృద్ధా..?’

‘ప్రైవేటుపరం చేయడమే అభివృద్ధా..?’