అంతా గోప్యమే..! | - | Sakshi
Sakshi News home page

అంతా గోప్యమే..!

Sep 17 2025 7:47 AM | Updated on Sep 17 2025 7:47 AM

అంతా గోప్యమే..!

అంతా గోప్యమే..!

ఎవరు పట్టించుకుంటారు..?

డీఎస్సీ మెరిట్‌ కం రోస్టర్‌ జాబితాపై అభ్యంతరాలు

తక్కువ మార్కులు వచ్చిన వారికి ఎగువ, ఎక్కువ మార్కులు వచ్చిన వారికి దిగువ స్థానాలు

న్యాయం చేయాలని వేడుకుంటున్నా పట్టించుకోని వైనం

శ్రీకాకుళం: డీఎస్‌సీ.. అంటే డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ అని అర్థం. ఈ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్‌, సభ్యులు గా జిల్లా పరిషత్‌ సీఈఓ, జిల్లా విద్యాశాఖ అధికారి ఉంటారు. వీరి నేతృత్వంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ జరుగుతుంది. గతంలో ఆఫ్‌లైన్‌ విధానంలో డీఎస్సీ నిర్వహించేవారు. ఇప్పుడు దాన్ని ఆన్‌లైన్‌ విధానంలోకి మార్చి నిర్వహిస్తున్నారు. సాధారణంగా పరీక్ష నిర్వహించిన తర్వాత మార్కుల ఆధారంగా ఎంపికై న అభ్యర్థుల జాబితాను రాష్ట్రస్థాయిలో విడుదల చేసి జిల్లాకు పంపిస్తారు. అటు తర్వాత జిల్లా స్థాయిలో మెరిట్‌ జాబితాను ప్రకటిస్తారు. ఇది పూర్తయిన తర్వాత రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా మెరిట్‌ కం రోస్టర్‌ జాబితాను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. అటు తర్వాత అభ్యర్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహించి పాఠశాలలను కేటాయిస్తారు.

కానీ కూటమి ప్రభుత్వం డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీకి బదులుగా స్టేట్‌ సెలక్షన్‌ కమిటీ విధానాన్ని అవలంబిస్తూ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియను రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తోంది. అక్కడ ఏం జరుగుతుందో జిల్లా విద్యాశాఖకు కూడా తెలియని పరిస్థితి. ఎందరో అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందని మొర పెట్టుకుంటున్నా తామేమీ చేయలేమని, రాష్ట్రస్థాయిలోనే సరిదిద్దుతారని చెబుతూ జిల్లా విద్యా శాఖ వర్గాలు చేతులెత్తేస్తున్నాయి. మార్కులు ప్రకటించిన నుంచి తుది జాబితా విడుదలైన వరకు ఒకరి మార్కులు ఒకరికి తెలియకుండా, ఎవరిని ఎంపిక చేశారో పక్క వారికి కూడా తెలియకుండా గోప్యంగా ప్రక్రియను నిర్వహిస్తుండడంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తుది జాబితాలో ఎన్నో పొరపాట్లు

రాష్ట్రస్థాయిలో సోమవారం విడుదల చేసిన మెరిట్‌ కం రోస్టర్‌ జాబితాలో ఎన్నో పొరపాట్లు జరిగాయి. దీనికి సంబంధించి కొందరు అభ్యర్థులు కలెక్టర్‌కు, జిల్లా విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నా వాటిని రాష్ట్రస్థాయికి నివేదిస్తామని అక్కడ సరిచేస్తారని చెబుతూ వస్తున్నారు. అభ్యర్థులు రాష్ట్రస్థాయికి తెలియజేసేందుకు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినప్పటికీ అది ఎప్పుడు పని చేస్తుందో తెలియని పరిస్థితి. ఒక వేళ పనిచేసినా సమస్యను నివేదించాక అధికారుల దృష్టికి తీసుకువెళతామని మాత్రమే చెబుతున్నారు తప్ప సమస్య పరిష్కారమైనట్లు ఎలాంటి సమాచారం ఉండటం లేదు. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

సాంఘిక శాస్త్ర విభాగంలో బిర్లంగి శ్రీదేవి అనే అభ్యర్థి 77.51 మార్కులను, అంపోలు పుణ్యవతి అనే అభ్యర్థి 75.6 మార్కులను, మెట్ట శారద అనే అభ్యర్థి 73.3 మార్కులను సాధించారు. వీరు ముగ్గురూ బీసీ ఏ కేటగిరీకి చెందినవారు. మార్కుల ఆధారంగా చూసుకుంటే శ్రీదేవి ముందుగాను, పుణ్యవతి, శారదలు అటు తర్వాత వరుస క్రమంలోనూ ఉండాల్సి ఉంది. అయితే విడుదలైన జాబితాలో శ్రీదేవి 51వ స్థానంలోనూ, పుణ్యవతి 46వ స్థానంలోనూ, ఉండగా శారద 20వ స్థానంలో ఉన్నారు. శ్రీదేవి గడిచిన రెండు రోజులుగా కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం చేసే వారే కరవయ్యారు. అభ్యర్థులను త్వరలోనే అమరావతికి తీసుకువెళ్లి అక్కడ నియామక పత్రాలు ఇస్తారని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికై న అందరినీ ఒక చోటకు చేర్చి నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు చెబుతుండగా, జిల్లా స్థాయిలో తప్పును సరిదిద్దకుండా రాష్ట్రస్థాయిలో ఇన్ని వేలమంది హాజరయ్యే సమయంలో తమకు న్యాయం జరగదని శ్రీదేవి ఆందోళనకు గురవుతున్నారు. తనకు ఎక్కువ మార్కులు వచ్చి నా వెనుకకు నెట్టడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సుదూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందేమోనని బెంగపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని కనిపించిన ప్రతి అధికారిని డీఎస్సీ కమిటీలోని సభ్యులందరినీ వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement