
హిందీ భాషాభివృద్ధిపై.. నిలువెల్లా నిర్లక్ష్యం
డిమాండ్లు ఇవే..
● టీచర్ల భర్తీ, ఇతర అంశాలపై కూటమి సర్కారు నిర్లక్ష్యం
● రాజభాషకు ప్రోత్సాహం కరువు
● నేడు జాతీయ హిందీ దివాస్
ప్రైవేటు స్కూళ్లలో నర్సరీ నుంచే హిందీ బోధన సాగుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో అలా జరగడంలేదు. కనీసం 2, 3వ తరగతుల నుంచైనా హిందీ బోధన మొదలుకావాలి. ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు, హిందీ భాషాపండితులను నియమించాలి. డీఎస్సీ ద్వారా హిందీ పండిట్‌పోస్టులను పెద్దఎత్తున భర్తీ చేయాలి.
– కోనే శ్రీధర్, ఉత్తరాంద్ర సమన్వయకర్త, హిందీ మంచ్
హిందీ భాషాభివృద్ధికి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు మరింతగా ప్రోత్సహించాలి. జాతీయ భాషగా హిందీకి తగిన గుర్తింపు ఇప్పటికీ లభించలేదనే చెప్పాలి. హిందీ భాషాభివృద్ధికి ప్రభుత్వాలు తోడ్పాటు అందించకపోతే మా గోడు ఎవరికి చెప్పుకోవాలి. వేలాది మంది హిందీ పట్టభద్రులు పండిట్ ట్రైనింగ్ కోసం నిరీక్షిస్తున్నారు. – కనుగుల సత్యం,
జిల్లా అధ్యక్షుడు, హిందీ మంచ్
హిందీ మన దేశ జాతీయ భాష. జాతీయ సమైక్యతను ఇనుమడింపజేసే భాష హిందీయే. రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలలో హిందీకి 17 సెక్షన్ల తర్వాతే రెండో పోస్టును భర్తీ చేస్తుండటం తగదు. ఇది తీరని అన్యాయం. హిందీ లెక్చరర్లను నియమించాలి. పదోన్నతులతో భర్తీచేయాలి.
– ఇమ్మిడిశెట్టి సంతోష్‌కుమార్,
హిందీ ఫోరం జిల్లా కన్వీనర్
శ్రీకాకుళం న్యూకాలనీ/శ్రీకాకుళం కల్చరల్: జాతీయ భాష హిందీపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. హిందీ భాషాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడంలేదు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో హిందీతోపాటు లాంగ్వేజ్ టీచర్లను సైతం నియమించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వైఎస్సార్ సీపీ పాలనలో హిందీ భాషాభివృద్ధికి పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. హిందీ సబ్జెక్ట్ టీచర్లు పాఠశాలల్లో ఉండేలా జాగ్రత్తలు చేపట్టారు. గత డీఎస్సీలో హిందీ పోస్టులను సైతం భారీగా భర్తీ చేశారు. ప్రస్తుతం హిందీ భాష పట్ల, హిందీ ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని పలువురు భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి రాజ భాషగా హిందీని ప్రోత్సహించాలని హిందీమంచ్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
నేటి నుంచి పక్షోత్సవాలు..
ఈ నెల 14న జాతీయ హిందీ దివాస్ సందర్భంగా.. ఆదివారం నుంచి పక్షోత్సవాలను నిర్వహించేందుకు సన్నద్ధమౌతున్నారు. ఆదివారం నుంచి 28వ తేదీ వరకు 15 రోజులపాటు ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల్లో, ప్రతి జిల్లాలో ఐదు రోజులు పాటు హిందీ దివస్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు మంచ్ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కోనే శ్రీధర్ నేతృత్వంలో ఏర్పాట్లు సాగుతున్నాయి. హిందీ ఫోరం, హిందీ వికాస వేదిక ఆధ్వర్యంలో విద్యార్ధులను హిందీపై ఆసక్తిపెంచేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేలా కసరత్తులు చేశారు. మరోపక్క హిందీ సులేఖన్ పోటీలను పోటీలను నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించారు.
హైస్కూళ్లలో హిందీ పండింట్ల సంఖ్యను పెంచాలి.
ప్రైవేటు స్కూళ్లలో ఎల్‌కేజీ నుంచే బోధన మొదలవుతుది. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ప్రాథమికస్థాయి నుంచే కనీసం రెండో తరగతి నుంచే హిందీ బోధన అమలు చేయాలి.
ప్రాథమిక స్థాయి నుంచి హైస్కూల్ ప్లస్(జూనియర్ కాలేజీల) స్థాయి వరకు అన్ని పాఠశాలల్లో మిగతా సబ్జెక్టులతో సమానంగా హిందీ పండిట్ పోస్టులను భర్తీ చేయాలి.
మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలలు, హైస్కూల్ ప్లస్, జూనియర్ కాలేజీల్లో పీజీటీ హిందీ/లెక్చరర్ పోస్టులను మంజూరు చేయాలి.
హిందీ పండిత శిక్షణా కళాశాలలను తక్షణమే ప్రారంభించాలి. వేలాది మంది హిందీ పట్టభద్రులు రాష్ట్రంలో హిందీ పండిట్ ట్రైనింగ్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో హిందీ ద్వితీయ భాషగా హిందీ అధ్యయనాన్ని ప్రోత్సహించాలి.
రాబోయే డీఎస్సీలో హిందీ పండిట్ పోస్టుల సంఖ్యను పెంచాలి.
6 నుంచి 10వ తరగతి వరకు హిందీ పాఠ్యపుస్తకాలను సరళంగా మార్చాలి. త్రిభాషా సూత్రాన్ని రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయాలి.
2024–25 విద్యా సంవత్సరానికిగాను ఎల్పీసెట్(భాషా హిందీ ప్రవేశపరీక్ష) ద్వారా హిందీ పండిత శిక్షణ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి.

హిందీ భాషాభివృద్ధిపై.. నిలువెల్లా నిర్లక్ష్యం

హిందీ భాషాభివృద్ధిపై.. నిలువెల్లా నిర్లక్ష్యం

హిందీ భాషాభివృద్ధిపై.. నిలువెల్లా నిర్లక్ష్యం