
బాక్సింగ్ క్రీడాకారులకు అభినందనలు
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలిలోని మార్షల్ ఆర్ట్స్ అకాడమికి చెందిన పలువురు బాక్సింగ్ క్రీడాకారులు ఈ నెల 14న విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయం వేదికా జరిగే రాష్ట్రస్థాయి మహిళా కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. వీరిని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ జిల్లా చైర్మన్ నటుకుల మోహన్ శనివారం అభినందించారు. రాష్ట్రస్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చీఫ్ కోచ్ వై.హేమంత్‌కుమార్, కోచ్ డి.హరీష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి వనరులకు నెలవు ఉద్దానం
పలాస: ఉద్దానం ప్రాంతంలో అపారమైన ప్రకృతి వనరులు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ చెప్పారు. ‘ఉద్దానం ప్రాంత అభివృద్ధి ,అవకాశాలు, అవరోధాలు’ అనే అంశంపై కాశీబుగ్గలో శనివారం వివిధ ప్రజాసంఘాల నాయకులు, మేధావులతో రౌండు టేబుల్ సమావేశం నిర్వహించారు. వేదిక ప్రతినిధి జుత్తు సింహాచలం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అజశర్మ మాట్లాడుతూ చిత్తడి నేలలు, సముద్రతీరం, ఉద్యాన పంటలు, సారవంతమైన భూమి వంటి ప్రకృతి వనరులను కాపాడుకోవాలన్నారు. జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించి, 80కిలోల బస్తాకు రూ.16వేలు చెల్లించాలని, వాటిని రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జీడి బోర్డుతో పాటు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కొబ్బరి బోర్డు, జీడి కొబ్బరి నార సహకార పరిశ్రమలను ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యాన పంటలకు ఉచితంగా ఎరువులు, పురుగుల మందులను సరఫరా చేయాలని కోరారు. కిడ్నీ వ్యాధి నిర్మూలనకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌ను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వంశధార ప్రాజెక్టు ద్వారా శివారు భూములకు నీరందించాలన్నారు. మత్స్యకారులకు ఉపాధితో పాటు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు కొత్తకోట అప్పారావు, పాలవలస ధర్మారావు, డాక్టర్ మట్ట ఖగేశ్వరరావు, తెప్పల అజయ్‌కుమార్, కె.హేమారావు చౌదరి, కూన వెంకటరావు, గోపాలకృష్ణ, బద్రి కూర్మారావు, పోతనపల్లి గీతమ్మ, కుత్తు వినోద్, దేవేంద్ర వర్మ, జానకి రామయ్య, కొమర వాసు, బాబూరావు, గణేష్, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

బాక్సింగ్ క్రీడాకారులకు అభినందనలు