
వేతన సవరణ కోరుతూ పోస్టుకార్డు ఉద్యమం
శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం 12వ వేతన సవరణ అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ పోస్టు కార్డు ఉద్యమం చేపడుతున్నట్లు ఎస్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్వీ రమణమూర్తి, జి.రమణ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని క్రాంతిభవనంలో శనివారం సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఐదేళ్లకోసారి వేతన సవరణ అమలు చేయాల్సి ఉందని, 11వ వేతన సవరణ గడువు 2023 జూలై 1 నాటికి ముగిసినా ఇప్పటివరకు పీఆర్‌సీ బకాయిలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కమిటీ వేయకపోవడం విచారకరమన్నారు.
కనీసం ఐఆర్ కూడా ప్రకటించలేదన్నారు. పెండింగ్ బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదన్నారు. జిల్లాలో 471 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు దూరప్రాంతాల్లో పనిచేస్తున్నారని, వారికి ఇంటి అద్దె అలవెన్స్ ఇస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సమావేశంలో సంఘ ఆర్థిక కార్యదర్శి పి.రామకృష్ణ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాసరావు, గురువు శ్రీనివాసరావు, డీవీఎన్ పట్నాయక్, ఎస్.రామచంద్రరావు, జి.తిరుమలరావు, ఎం.మురళీధర్, బి.ఇందిర తదితరులు పాల్గొన్నారు.