
నేడు ఎన్‌జివో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల రాక
శ్రీకాకుళం అర్బన్: ఏపీ ఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణకు జిల్లా కార్యవర్గం ఆదివారం ఆత్మీయ సత్కారం చేయనుందని సంఘ అధ్యక్ష, కార్యదర్శులు హనుమంత్ సాయిరాం, చల్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జెడ్పీ సమావేశ మందిరంలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని కోరారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా జెడ్పీ గేట్ నుంచి సమావేశ మందిరం వరకు ర్యాలీ ఉంటుందని తెలిపారు. ఉద్యోగవర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
పూర్తి అవగాహనతో వైద్యం అందించాలి
అరసవల్లి:గ్రామీణ ప్రాంతాల్లో కచ్చితంగా పూర్తి అవగాహనతోనే వైద్యం అందించాలని గ్లోబల్ న్యూరో కేర్ అధినేత డాక్టర్ దేవరెడ్డి గౌతమ్ సూచించారు. వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా శనివారం రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో గ్లోబల్ న్యూరోకేర్ ఆసుపత్రిలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పల్లెల్లో మితిమీరిన వైద్యం, మందుల వినియోగాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి వారికి అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు శిష్టు అనిల్, బండి గౌతమ్, గీతాప్రియదర్శిని, మార్కెటింగ్ హెడ్ సీహెచ్ స్వామి, రెడ్‌క్రాస్ మేనేజర్ రమణ పాల్గొన్నారు.
గంజాయితో ముగ్గురి అరెస్టు
ఇచ్ఛాపురం: స్థానిక రైల్వేస్టేషన్ ఆవరణలో 5 కేజీల గంజాయితో ముగ్గురు పట్టుబడ్డారని డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. ఇచ్ఛాపురం సీఐ కార్యాలయం వద్ద శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పట్టణ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు రైల్వేస్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా తమిళనాడుకి చెందిన ముత్తుకుమార్, ఉదయ్‌కుమార్, ముత్తురామలింగంలు 5 కేజీల గంజాయితో పట్టుబడ్డారు. తమిళనాడు రాష్ట్రం తిరుప్పూరుకు చెందిన గంజాయి వ్యాపారి పాండ్యరాజు సూచన మేరకు ఒడిశా రాష్ట్రం మోహన బ్లాక్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి బస్సు ద్వారా ఇచ్ఛాపురం చేరుకొన్నారు. అనంతరం రైలులో తమిళనాడు వెళ్లేందుకు బయలుదేరగా పోలీసులు పట్టుకున్నారు. వీరిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కి తరలించారు. వీరి వద్ద నుంచి గంజాయి, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలో గంజాయిని విక్రయించిన కుమార్, గంజాయిని తీసుకురావాలని సూచించిన పాండ్యరాజ్‌పైనా కేసులు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. సీఐ మీసాల చిన్నంనాయుడు, ఎస్సై ముకుందరావు, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.
గుర్తు తెలియని
వృద్ధుడు మృతి
రణస్థలం: లావేరు మండలం బొంతుపేట శ్మశానవాటిక వెనుక ఉన్న పొలంలో సుమారు 65 ఏళ్ల వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మృతదేహం పక్కనే చేతి కర్ర ఉందని, వివరాలు తెలిసిన వారు 63099 90851 నంబరుకు తెలియజేయాలని లావేరు ఎస్సై జి.లక్ష్మణరావు కోరారు.

నేడు ఎన్‌జివో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల రాక