
దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు
● సిక్కోలు నుంచే తిరుగుబాటు ఆరంభం కావాలి
● వైఎస్సార్‌సీపీ దళిత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెయ్య వెంకటరమణ
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): దళితుల ఓట్లు, సీట్లు మాత్రమే సీఎం చంద్రబాబుకు కావాలని, వారి సంక్షేమం అవసరం లేదని వైఎస్సార్ సీపీ దళిత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెయ్య వెంకటరమణ మండిపడ్డారు. దళితులంటే టీడీపీకి ఎప్పుడు చిన్నచూపేనన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా దళితులంతా ఏకతాటిపైకి రావాలని కోరుతూ ఈ నెల 17న వైఎస్సార్‌సీపీ దళిత విభాగం ఆధ్వర్యంలో విస్తృతస్థ్ధాయి సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో బృందావనంలో జరిగే ఈ సమావేశానికి జిల్లాలోని దళిత యువత, ఉద్యోగ, నిరుద్యోగ, పలు విభాగాల నాయకులతో పాటు దళిత జాతి అంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, అన్ని నియోజకవర్గవర్గాల ఇన్‌చార్జిలు పాల్గొని దళితులకు అండగా నిలవాలని కోరారు. ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి మాట్లాడుతూ మనిషిగా పుట్టాలనుకునేవాడు దళితుల్లో పుట్టాలనుకుంటారా అని మాట్లాడిన నీచ సంస్కృతి చంద్రబాబుదన్నారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులున్నా దళితులకు ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదన్నారు. దళితులకు యూరియా ఇవ్వకుండా కేవలం టీడీపీ నేతలే పంచుకుంటున్నారని దుయ్యబట్టారు. దౌర్జన్యంగా రేషన్‌డిపోల డీలర్లను తొలగించేశారన్నారు. కూటమి నేతలపై దళితుల తిరుగుబాటు శ్రీకాకుళం జిల్లా నుంచే మొదలవుతుందన్నారు.
ప్రతి గ్రామం నుంచి ఈ నెల 17న జరిగే సమావేశానికి హాజరుకావాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి, నియోజకవర్గ ఇన్‌చార్జి యజ్జల గురుమూర్తిలు మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుచేసి దళితుల జీవితాలతో ఆడుకోవడం సరికాదన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నియోజకవర్గంలోనూ, శ్రీకాకుళం జిల్లాలో సౌమ్య, గతంలో కొరపాన కళ్యాణి అనే ఉద్యోగినులపైనా టీడీపీ నేతలు దాడులు, వేధింపులకు పాల్పడ్డారని గుర్తు చేశారు. వీటిని అరికట్టాలంటే దళితులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ దళిత విభాగం నాయకులు లక్ష్మణరావు, రామినాయుడు, గడ్డయ్య, నీలాపు ముకుందరావు, జలగడుగుల శ్రీనివాస్, నల్లబారికి శ్రీనివాసరావు, త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు.