అరసవల్లి : పేరుగొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా మారింది అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం పరిస్థితి. డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్న ఆదిత్యాలయం వార్షికాదాయం సుమారు రూ.20 కోట్లకు చేరుకుంది. అయినా అందుకు తగ్గట్టుగా నిర్వహణ లేదనే చెప్పాలి. భక్తుల సౌకర్యాలు పక్కనపెడితే.. పవిత్రమైన గోమాతలను కూడా పోషించలేమని వాటిని వదిలించుకునేందుకు సిద్ధపడ్డారు. పోషణను భారంగా భావించి గోవులను ఇతరులకు అప్పగించాలని నిర్ణయించడం చర్చనీయాంశమైంది.
భక్తుల అసంతృప్తి..
ఇప్పటికే అనేక వివాదాల చుట్టూ బిగుసుకున్న ఆదిత్యాలయంలో తాజాగా గోవుల తరలింపు నిర్ణయం వివాదాస్పదమవుతోంది. 2002 నుంచి అరసవల్లి ఆలయంలో ఉన్న గోశాలలో పలు గోవులను పోషిస్తూవస్తున్నారు. ఆలయ వార్షిక బడ్జెట్‌లో కూడా ఈమేరకు కేటాయింపులుండటంతో కార్యనిర్వహణాధికారులు ఈ గోశాల అంశంలో వెనక్కితగ్గకుండా నిర్వహించారు. తాజాగా 13 గోవుల్లో (చిన్నవి పెద్దవి కలుపుకుని) ఏకంగా 8 ఆవులను రైతులుగా పేర్కొన్న ఓ నలుగురు ప్రైవేటు వ్యక్తులకు పశుపోషణకు అప్పగిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ పేరిట అధికారిక ప్రకటనను (ఆర్‌సీ–జి/9/2025) బుధవారం విడుదల చేసింది. గోశాలలో గోవులకు ఫల నివేదన చేసి పూజలు చేసిన తర్వాతే స్వామి దర్శనాలకు వచ్చే ఆచారం ఇక్కడ కొనసాగుతోంది. తాజా నిర్ణయంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
స్థల సమస్య పేరిట...
ఆదిత్యాలయంలో పాత గోశాలను తొలగించి 2023 ఆగస్టులో పశ్చిమగోదావరి జిల్లా పెద్దపుల్లేరుకు చెందిన వ్యాపారవేత్త కలిదిండి నరసింహరాజు దంపతులు సుమారు రూ.6 లక్షల సొంత నిధులతో సరికొత్తగా గోశాలను నిర్మించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రథసప్తమి రాష్ట్ర పండుగ నిర్వహణ ఏర్పాట్లులో భాగంగా గతేడాది డిసెంబర్‌లో ఆలయం ముందున్న దుకాణాలు, జింక్ షెడ్లు, వసతి గదులు, అన్నదాన మండపం, ప్రసాదాల తయారీ, టికెట్ కౌంటర్లను అనాలోచితంగా కూల్చివేశారు. ఈ క్రమంలోనే కొత్త గోశాలను కూడా కూల్చేసి దగ్గర్లో మరో స్థలంలో అదే మెటీరియల్‌తో గోశాలను నిర్మించారు. ఇక్కడే 13 గోవులు పోషణలో ఉన్నా యి. ఇప్పుడు స్థల సమస్యను కారణంగా చూపు తూ గోవుల సంఖ్యను తగ్గించే చర్యలకు దిగారు. వాస్తవానికి నాలుగు నెలల నుంచి వీటి పోషణకు అధికారులు తగిన చర్యలు చేపట్టడం లేదు. 13 ఆవులకు నెలకు 21 బస్తాల తవుడు, 3 లోడుల గడ్డి అవసరం. కాంట్రాక్టర్ సక్రమంగా తవుడు అందివ్వడం లేదనే కారణంతో పాటు ఒక్కో గడ్డి లోడు రూ.5 వేల వరకు ఉంటుందని.. ఇంత భారం మనకెందుకనే ధోరణిలోనే ఆవులను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఎనిమిది ఆవులను పొగాకువానిపేటకు చెందిన బోర బాలకృష్ణ, వాడాడ (కొత్తరెడ్డిపేట)కు చెందిన పంచిరెడ్డి అప్పన్న, వాడాడకు చెందిన రెడ్డి జగన్నాథం, జలుమూరు మండలం బసివాడకు చెందిన అల్లు వెంకటప్పయ్యలకు రెండేసి చొప్పున ఆవులను అప్పగించేందుకు నిర్ణయించారు.
అప్పగింతకు
సిద్దమైన గోవు
అరసవల్లి గోశాలలో 8 ఆవులు ఇతరులకు ఇచ్చేందుకు నిర్ణయం
భక్తుల నుంచి తీవ్ర విమర్శలు
అభ్యంతరాలుంటే
తెలియజేయవచ్చు: ఈవో
అభ్యంతరాల స్వీకరణ
గోశాలలో స్థలాభావం, శాశ్వత గోశాల లేకపోవడంతో ఉన్న ఆవుల్లో 8 ఆవులను రైతులకు అప్పగించనున్నాం. ఎవరికై నా అభ్యంతరాలుంటే 8978914660 నంబర్‌కు ఏడు రోజుల్లో సంప్రదించి వివరాలు గానీ, అభ్యంతరాలు గానీ తెలియజేయవచ్చు. – కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్,
ఆలయ ఈవో, అరసవల్లి
పోషణ భారమై.. గోవులకు గుడ్‌బై!
పోషణ భారమై.. గోవులకు గుడ్‌బై!