
ప్రభుత్వ భవనాల కూల్చివేత దారుణం
● పంచాయతీ భవనాన్ని వెంటనే
పునర్నిర్మించాలి
● మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి డిమాండ్
పాతపట్నం: మండల కేంద్రం పాతపట్నంలోని పంచాయతీ భవనాన్ని కూల్చివేయడం దారుణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. పాతపట్నం మేజర్ పంచాయతీ కార్యాలయం భవనం కూల్చివేసిన స్థలాన్ని బుధవారం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీ భవనం, స్థలం ప్రజలు ఆస్తి అని, ఏ ఒక్క పార్టీది కాదన్నారు. అధికారులు ముందస్తుగా ప్రజలకు తెలియజేయకుండా భవనం కూల్చివేయడం సరికాదన్నారు. ఈ స్థలం దాతలు విరాళంగా ఇచ్చారని చెప్పారు. మండల కేంద్రంలో పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారని, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్న క్యాంటీన్ కోసం ఎటువంటి అనుమతి లేకుండా పంచాయతీ కార్యాలయం కూల్చివేయడం మంచి పద్ధతి కాదన్నారు. రాత్రికి రాత్రే భవనం కూల్చివేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పంచాయతీ భవనాన్ని వెంటనే పునర్నిర్మించాలన్నారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆమెతో పాటు మండల పార్టీ అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్, ఐటీ వింగ్ విభాగం అధ్యక్షుడు ఏనుగుతల సూర్యం, యరుకోల వెంకటరమణ, గోకవలస రాము, మజ్జి వరదరాజులు, పడ్డ నేతాజి, రామారావు, ఆఫీసు, రామకృష్ణ, తులుగు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.