
టైగర్ హిల్స్‌లో శుత్రమూకలతో..
నేను 28వ రాష్ట్రీయ రైఫిల్స్ (జమ్ము కశ్మీర్)లో విధుల్లో ఉండేవాడిని. 1999 మే 15 అర్ధరాత్రి సమయంలో మాకు ఓ మెసేజ్ వచ్చింది. 38 గంటల్లో కార్గిల్ వైపు కదలాలని సూచన. మే 16 ఉదయం బయల్దేరాం. వాహనాల్లో మా ప్రయాణం. నాలుగు రోజుల సమయం పట్టింది. భారీ ఆయుధ సామగ్రితో ముందుకు కదిలాం. ద్రాస్ సెక్టార్‌కు చేరుకున్నాం. పర్వతం పైకి ఎలా వెళ్లాలో మాకు రూట్ మ్యాప్ ఇచ్చారు. 20 మంది చొప్పున బృందాలుగా పర్వతంపైకి ప్రయాణం. ఏకే 47, లైట్‌మెషిన్ గన్, ఎంఎంజీ, మోర్టాల్స్ మా ఆయుధాలు. గుళ్ల వర్షం కురుస్తూనే ఉంది. వారం రోజుల అనంతరం కీలక ప్రాంతమైన టైగర్ హిల్స్‌కు చేరుకున్నాం. ఈ క్రమంలో జూలై 26వ తేదీన అర్ధరాత్రి వేళ మా కదలికలను గమనించిన శత్రుసైన్యం దాడి చేసింది. నా కుడి చేతికి తీవ్రగాయమైంది. పట్టుతప్పి పర్వతంపై నుంచి కిందికి జారిపడి స్పృహ కోల్పోయాను. బాంబుల మోత ఓ వైపు.. చిమ్మ చీకటి మరోవైపు.. వణికించే చలిలో గాయాల బాధ.. చాలా సేపటి తర్వాత కేకలు వేయడంతో.. ప్రథమ చికిత్స అనంతరం హెలికాప్టర్ శ్రీనగర్ బేస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారం రోజులు తర్వాత.. అక్కడ రద్దీ పెరగడంతో ఢిల్లీలోని ఆర్‌ఆర్ ఆస్పత్రికి.. అక్కడ్నుంచి విశాఖలో ఉన్న ఐఎన్‌హెచ్ కల్యాణికి తరలించారు. 20 రోజుల మెరుగైన చికిత్స అనంతరం స్వగ్రామానికి చేరుకున్నాను. అనంతరం మళ్లీ విధుల్లో చేరాను. ఆపరేషన్ విజయ్‌లో ఓపీ స్టార్, ఓపీ విజయ్, ఓపీ రక్షక్, వుండెడ్ మెడల్స్‌ను ప్రభుత్వం నాకు అందించింది. 1991 జూలై 26న విధుల్లో చేరగా.. 2015 జూలై 26న సైన్యం నుంచి రిటైర్ అయ్యాను. నేటి యువతకు దేశరక్షణ విధులు ఎంత అవసరమో అవగాహన కల్పిస్తూ ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నాను.