
72 గంటలు ఫైరింగ్ ఆపలేదు..
అది 1999 మే 25. శ్రీనగర్ సమీపంలో 1889 ఎల్టీ రెజిమెంట్ డ్యూటీలో ఉన్నా. మరుసటి రోజు ఉదయాన్నే కార్గిల్ వైపు బయల్దేరాలని హయ్యర్ కమాండ్ నుంచి సమాచారం వచ్చింది. దీంతో అంతా ముందుకు కదిలాం. శత్రుమూకలు కొండపైనుంచి గుళ్ల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. మే 31 నాటికి ప్రతికూల పరిస్థితుల్లో టోలోలింగ్ పర్వత ప్రాంతానికి చేరుకున్నాం. వేసవి కాలం అయినా విపరీతమైన చలి. 421 కేజీల బరువైన 121 ఎంఎంగన్‌ను ఐదుగురు సభ్యులం చొప్పున మోసుకుంటూ.. ఫైరింగ్ చేస్తూ ముందుకుసాగాం. దాదాపు 72 గంటలు ఫైరింగ్ ఆపలేదు. గుళ్ల వర్షం కురుస్తూనే ఉంది. బాంబుల మోతతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. అలా రోజులు గడుస్తూ జూన్ 12 మొదటి విజయం దక్కింది. ద్రాస్ సెక్టార్‌లోని టోలోలింగ్ పర్వత ప్రాంతం భారత సైన్యం ఆధీనంలోకి వచ్చింది. కీలక ప్రాంతం స్వాధీనం కావడంతో విజయోత్సాహంతో ముందుకు కదిలాం. అదే రోజు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి పెద్ద కుదుపు. నా కుడి చేతికి తీవ్రగాయాలయ్యాయి. విపరీతంగా రక్తం పోతోంది. అయినా వెరవకుండా ముందుకు సాగాను. నా పరిస్థితి గమనించిన ఉన్నతాధికారులు అదే రోజు రాత్రి చికిత్స కోసం హెలీకాప్టర్‌లో ఆర్మీ బేస్ ఆస్పత్రికి తరలించారు. ఉదయం శస్త్రచికిత్స జరిగింది. మూడురోజుల తర్వాత విమానంలో చంఢీగడ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ 12 రోజులు ఉన్నాను. అనంతరం విశాఖపట్నంలోని ఐఎస్‌హెచ్ కల్యాణిలో వారం ఉండి అనంతరం ఊరికి వచ్చాను. అక్కడకు కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత విధుల్లో చేరాను. ఓపీ స్టార్ మెడల్‌ను ప్రభుత్వం అందజేసింది. 1995 అక్టోబర్ 31న సైన్యంలో విధుల్లో చేరి.. 2014 ఆగస్ట్ 1న పదవీవిరమణ చేశాను.