
ఇచ్ఛాపురం సబ్ పోస్టాఫీస్‌లో భారీ స్కామ్
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం సబ్ పోస్టాఫీసులో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఇక్కడ 33 ఖాతాల నుంచి రూ.2.86 కోట్లను పోస్టల్ సిబ్బంది, సహాయకులు కలిసి కాజేసిన వైనం విస్మయం కలిగించింది. ఈ మేరకు శుక్రవారం సోంపేట పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఎన్.శ్రీకాంత్, శ్రీకాకుళం ఈస్డ్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ కమల్‌హాసన్ ఇచ్ఛాపురం పోస్టాఫీసులో కొందరు ఖాతాదారులతో మాట్లాడారు. అందరి డబ్బు తిరిగి వస్తుందని భరోసా ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ నెల 7వ తేదీన ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఇచ్ఛాపురం పోస్టాఫీస్‌లో ఆన్‌లైన్‌లో అవకతవకలు జరిగాయని పైఅధికారులకు ఓ ఫిర్యాదు వెళ్లింది. దీనిపై వారు దర్యాప్తు నిర్వహించగా గత డిసెంబర్‌లో 33 ఖాతాల నుంచి రూ.2.86 కోట్లు కాజేసినట్లు తేలింది. దీంతో శుక్రవారం సోంపేట పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఎన్.శ్రీకాంత్, శ్రీకాకుళం ఈస్ట్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ కమల్‌హాసన్ ఇచ్ఛాపురం పోస్టాఫీసుకు వచ్చారు. కొంతమంది ఖాతాదారులను పిలిపించుకుని మాట్లాడారు. ఖాతాదారులకు సంబంధం లేకుండా వారి అకౌంట్లు క్లోజ్ చేసి డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు. వీరిలో ఎక్కువగా కిసాన్ వికాస్ పత్ర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను క్లోజ్‌చేసినట్లు తెలుసుకున్నారు. ఈ స్కామ్‌లో 14 మంది అనుమానితులుగా ఉన్నారని, వారిలో ఐదుగురిని సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతుందని, ఖాతాదారులకు వారు కట్టిన ప్రతి పైసా కూడా అందుతుందని చెప్పారు.
33 ఖాతాల నుంచి రూ.2.86 కోట్ల నగదు మాయం ఐదుగురు సస్పెన్షన్