
అర్హత ఉన్నా అందని ‘తల్లికి వందనం’
హిరమండలం: అన్ని రకాలుగా అర్హత ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో ఓ కుటుంబానికి తల్లికి వందనం పథకం వర్తించలేదు. బాధిత కుటుంబానికి అసలు విద్యుత్ కనెక్షనే లేదు..కానీ 74 సర్వీసులు ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తోంది. దీంతో వీరికి పథకం రాలేదు. గులుమూరు పంచాయతీ జగన్నాథపురం సమీపంలో రేకుల షెడ్‌లో నిమ్మక పెంటయ్య, ఈశ్వరి దంపతులు నివసిస్తున్నారు. వీరి ముగ్గురు పిల్లలు హేమంత్, జస్మిత, దార్మిక్‌లు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వీరి ఇంటికి పూర్తిగా విద్యుత్ కనెక్షనే లేదు. కానీ వీరి ఆధార్‌తో అనుసంధానమై 74 కనెక్షన్లు ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తోంది. పోలాకి మండలంలో 5, రణస్థలంలో 4, జి.సిగడాంలో 3, లావేరులో 8, పొందూరులో 34, ఎచ్చెర్లలో 20 విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు చూపిస్తోంది. దీనిపై పెంటయ్య హిరమండలం విద్యుత్ ఉపకేంద్రంలో విన్నవించగా ఇన్‌చార్జ్ ఏఈ వెంకటేశ్వరరావు వీరి పేరున హిరమండలంలో ఎలాంటి విద్యుత్ కనెక్షన్ లేదని లేఖ ఇచ్చారు. ఆ లేఖను చూపించినా వారికి పథకం రాలేదు.
గార, హిరమండలం
ఎంపీడీఓలపై కలెక్టర్ ఆగ్రహం
శ్రీకాకుళం పాతబస్టాండ్: వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్యం, మురుగుకాలువల శుభ్రత పనుల్లో నిర్లక్ష్యం చూపిన గార, హిరమండలం ఎంపీడీఓలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పీఆర్జీఎస్, కోర్టు కేసులు, ఎరువుల పంపిణీ, పి–4 సర్వే పురోగతి వంటి అంశాలపై విపులంగా సమీక్షించారు. నీటి నాణ్యత పరీక్షలు, కాలువల శుభ్రత, హాస్టళ్ల పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎరువుల పంపిణీలో అలస త్వం పనికిరాదని, కొరత అనే పదం వినిపించకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు బి.పద్మావతి, జయదేవి, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
ఉపాధి పనుల పరిశీలన
సంతబొమ్మాళి: నేషనల్ లెవల్ మానిటరింగ్ టీమ్ సభ్యులు నునీల్ బంటా, నామాసింగ్ బృందం మండలంలోని బోరుభద్ర, ఉమిలాడ పంచాయతీల్లో మంగళవారం పర్యటించారు. ఆయా పంచాయతీల్లో ఉపాధి హామీ వేతనదారులు, డ్వాక్రా మహిళలు, గృహనిర్మాణ పనుల లబ్ధిదారులతో ముచ్చటించారు. ఉపాధి పను లు గ్రామానికి ఎంత దూరంలో చేస్తున్నారు, బిల్లులు అందుతున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. రుణాలు సకాలంలో అందుతున్నాయా, ఆ రుణాలతో ఎలాంటి స్వయం ఉపాధి కార్యక్రమాలు చేస్తారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ఉపాధి పనులు పరిశీలించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సుధాకర్, ఎంపీడీఓ జయంత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎగబడితేనే ఎరువు
అధికారులేమో ఎరువుల కొరత లేదని చెబుతున్నారు. రైతులు మాత్రం ఎదురుచూసీ చూసీ ఎగబడితే గానీ ఎరువు దొరకడం లేదు. ఎల్‌ఎన్‌పేట మండలంలోని పెద్దకోట 1, 2 రైతు సేవా కేంద్రం పరిధిలోని రైతులకు మంగళవారం ఎరువులు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒకేసారి వందలాది మంది రావడంతో గందరగోళం నెలకొంది. అధికారులు అందరికీ సర్దిచెప్పేటప్పటికి వారి తల ప్రాణం తోకకు వచ్చింది. – హిరమండలం

అర్హత ఉన్నా అందని ‘తల్లికి వందనం’

అర్హత ఉన్నా అందని ‘తల్లికి వందనం’