
● ఉపాధ్యాయ, ఉద్యోగులకు నాలుగు డీఏల బకాయిలు ● ఐఆర్, పీఆ
శ్రీకాకుళం: బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగులనూ వంచించింది. ఎన్నికల వేళ ఎన్నో వరాలను కురిపించి తీరా గద్దెనెక్కాక ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా కొత్త సమస్యలను సృష్టిస్తోందన్న వాదన ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల నుంచి వినిపిస్తోంది. 2023 జూలై నుంచి ఒక్క డీఏ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు అందుకోలేకపోయారు. దీంతో ఇప్పటివరకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నట్లు అయ్యింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆయా ఉద్యోగులకు ఒక్క డీఏ కూడా పెండింగ్ లేదు. కేంద్ర ప్రభుత్వంప్రకటించిన ఒకటి రెండు నెలలు అటు ఇటుగా రాష్ట్ర ప్రభుత్వం సైతం డీఏలను ప్రకటించాల్సి ఉంటుంది. దీనిని కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు.
చంద్రబాబు తీరే అంత..
1999 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులకు ఐదు డీఏలను రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో డీఏల సాధనకు డీఏ పోరాట సాధన కమిటీని ఏర్పాటు చేసుకొని ఉద్యమించినా ఫలితం లేకపోయింది. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. చంద్రబాబు రద్దు చేసిన డీఏలతో పాటు కొత్త డీఏలు సైతం సకాలు చెల్లించి ఉద్యోగుల మన్ననలను పొందారు. 11వ ఆర్థిక సంఘం సమ్మిట్లో పాల్గొన్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి సూచనలు చేస్తూ కేంద్రం రాష్ట్రాలతో సంప్రదించకుండా డీఏలను ఇస్తే రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతుందని పేర్కొనడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వంలోనూ చంద్రబాబు ఇదే ధోరణి అవలంబిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు.
పీఆర్‌సీ ఇప్పట్లో లేనట్లేనా..
పీఆర్‌సీకి సంబంధించి ఇప్పటికే రెండేళ్ల గడువు ముగిసింది. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2023 జూలై 24న పీఆర్‌సీ కమిటీని నియమించి దానికి చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్‌ను నియమించిన తెలిసిందే. 2024 జూలైలోగా కమిటీ నివేదికను సమర్పించాలని గడువును విధించారు. 2024 మేలో తెలుగుదేశం అధికారంలోకి రావడంతో మన్మోహన్సింగ్ తాను ఈ ప్రభుత్వంలో చైర్మన్‌గా పనిచేయలేనంటూ రాజీనామా చేశారు. ఇది జరిగి ఏడాది కావస్తున్న కొత్త చైర్మన్ను నియమించకపోవడాన్ని ఉద్యోగ సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. తక్షణం చైర్మన్ను నియమించినా అధ్యయనానికి నివేదిక సమర్పించడానికి ఏడాది సమయం పడుతుంది. ఈ లెక్కన ఇప్పుడు కమిటీని నియమించిన 2026 ఆగస్టు వరకు నివేదిక సమర్పించే పరిస్థితి ఉండదు. అటు తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమ సంఘాలతో చర్చించడం మరలా పరిశీలనకు కమిటీ అంటూ మంత్రులను నియమించడం చంద్రబాబుకు ఆనవాయితీగా వస్తుందని, అంటే తక్షణం కమిటీని నియమించిన 2027 మార్చి వరకు పీఆర్‌సీ అమలు కాదన్నది తేటతెల్లమవుతుందని ఉద్యోగ, ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. జమిలీ ఎన్నికలు జరిగితే 2027 లోనే జరిగే అవకాశాలు ఉండడంతో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పీఆర్‌సీ అమలు కాదేమోనన్న ఆందోళనలో ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఉద్యమ బాట పట్టేందుకు కార్యాచరణ రూపొందించుకోవడంలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు సమావేశమవుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఇవి కార్యరూపం దాల్చి ఉద్యోగులు ఆందోళన బాట పట్టే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తక్షణం ప్రకటించాలి
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన నాలుగు డీఏలను తక్షణం అమలు చేయాలి. పీఆర్‌సీని నియమించి ఐఆర్ను ప్రకటించాలి. డీఏలు అందక ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇప్పటికే ఎంతో నష్టపోయారు.
– చింతల రామారావు,
ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలి. సుమారు 20 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. పీఆర్‌సీ నివేదిక వచ్చే వరకు మధ్యంతర భృతి ప్రకటించి, డీఏ బకాయిలు చెల్లించాలి.
– కిలారి నారాయణరావు,
పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం నాయకులు

● ఉపాధ్యాయ, ఉద్యోగులకు నాలుగు డీఏల బకాయిలు ● ఐఆర్, పీఆ

● ఉపాధ్యాయ, ఉద్యోగులకు నాలుగు డీఏల బకాయిలు ● ఐఆర్, పీఆ