
అక్రమ ఇసుక ర్యాంపులు ఆపాల్సిందే
ఆమదాలవలస: ఆమదాలవలస మండలంలోని కొత్తవలసలో కొనసాగుతున్న అనధికార ఇసుక ర్యాంపును ఆపాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌తో కలి సి కొత్తవలస, పాత నిమ్మతొర్లువాడ ఇసుక ర్యాంపులను పరిశీలించారు. అనంతరం ఇసుకాసురుల దాడిలో గాయపడిన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ నదీగర్భం వరకు తవ్వకాలు చేయడం దారుణమన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. నారా లోకేష్ ఆధ్వర్యంలోనే అనధికార ర్యాంపులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంత ఘోరంగా తవ్వుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తవలస నుంచి ఆమదాలవలసకు తాగునీరు అందించే సౌకర్యం ఉందని, ఇసుక తవ్వకాలతో అది ప్రమాదంలో పడుతుందన్నారు. కొత్తవలస పక్కనే ఉన్న పాత నిమ్మతొర్లువాడలో తవ్వకాలు చేస్తున్నారని, శ్మశాన వాటిక, మైదానాన్ని విడిచిపెట్టాలని కోరితే వంద మంది కర్రలు, రాడ్డులతో దాడికి పాల్పడడం అమానుషమన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు.
‘కూన’ సన్నిహితులే దాడి చేశారు..
ఆమదాలవలసలో నిర్వహిస్తున్న అక్రమ ఇసుక ర్యాంపులు స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆ ధ్వర్యంలోనే నడుస్తున్నాయని చాలాసార్లు ఫిర్యా దు చేశామని పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. రాత్రివేళలో అమాయకులైన పాతనిమ్మతొర్లువాడ గ్రామ ప్రజలపై దాడికి పాల్పడడం ఎంతవరకు సమంజసమన్నా రు. సీసీ ఫుటేజీ చూస్తే ఎవరు దాడి చేశారో తెలిసిపోతుందని, పోలీసులు దాచి పెట్టాల్సిన అవసరం ఏముందన్నారు. బాధితులను పరామర్శించేందు కు వస్తున్నామని తెలిసి గాయపడిన వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్‌కుమార్, పార్టీ జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, సరుబుజ్జిలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, బూర్జ మండల పార్టీ అధ్యక్షులు ఖండాపు గోవిందరావు, ఆమదాలవలస మున్సిపల్ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, ముఖ్యనాయకులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, దుంపల శ్యామలరావు, మానుకొండ వెంకటరమణ, ఎ.రవికాంత్, గురుగుబెల్లి అప్పలనాయుడు, చిగురుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.
శ్మశానాలనూ వదలకుండా తవ్వేయడం సబబు కాదు
పాతనిమ్మతొర్లువాడ వాసులపై దాడి దారుణం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్