
ఎరువుల షాపు సీజ్
శ్రీకాకుళం రూరల్: ఎటువంటి పత్రాలు లేకుండా ఎరువులు అమ్ముతున్న ఒక షాపును విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు మాకుమ్మడిగా దాడులు చేసి సీజ్ చేశారు. మండల పరిధిలోని సింగుపురం గ్రామంలో ఉన్న గౌతమ్ ట్రేడర్స్ హోల్‌సేల్ ఎరువుల షాపులో సోమవారం రాత్రి తనిఖీలు చేయగా కిబ్కో కంపెనీకు చెందిన ఎరువులు డీఏపీ, యూరియా సంబంధిత కంపెనీలకు చెందిన ఓఫారం లేకుండా గడిచిన రెండు రోజులుగా అమ్ముతున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వీటితో పాటు సింగిల్ సూపర్ ఫాస్పేట్ గ్రీన్‌స్టార్ కంపెనీకు చెందిన 10 టన్నుల ఎరువులను స్టాక్‌బుక్‌లో నమోదు చేయకుండా డీలర్లకు ఆ షాపు యజమాని అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో సంబంధింత షాపును విజిలెన్స్ అధికారులు 15 రోజులు పాటు సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే షాపులో ఉన్న 71.02 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాన్ని పూర్తిగా నిలుపుదల చేసినట్లు నోటీసులు అందజేశారు. ఈ తనిఖీల్లో స్వ్యాడ్ టీమ్‌తో పాటు వ్యవసాయ సహాయ సంచాలకులు బి.విజయ్‌ప్రసాద్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజిలెన్స్ ఆడారి సంతోష్ మండల వ్యవసాయాధికారి నవీన్ తదితరులు పాల్గొన్నారు.