
280 మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ
జి.సిగడాం: మండలంలో అర్హత ఉన్న ప్రతి రైతుకు రాయితీపై ఎరువులు పంపిణీ చేస్తున్నామని జి.సిగడాం మండల వ్యవసాయాధికారి బెండి బాబ్జీ తెలిపారు. ఈ నెల 11న ‘బారులు తీరితేనే’ ఎరువులు, ఈ నెల 12న ‘ఎరువూ కరువే’ అనే శీర్షికలతో సాక్షిలో ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించారు. మండలానికి 280 మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించారు. వీటిని పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేసినట్లు ఏఓ తెలిపారు. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడికి గాయాలు
పాతపట్నం : పాతపట్నం మండల కేంద్రంలోని ఆల్‌ఆంధ్ర రోడ్డు సమీపంలో మొబైల్ షాపు ఎదురుగా శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం ఆల్‌ఆంధ్ర రోడ్డు సమీపంలోని మొబైల్ షాపు ఎదురుగా పాతపట్నం కొత్త దేవాంగుల వీధికి చెందిన వృద్ధుడు కొసమాన మోహనరావు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్ధుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు స్పందించి పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. వైద్యుడు శేషుబాబు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి పంపించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారారు. వృద్ధుడి కుమారుడు కొసమాన మల్లేశ్వరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్‌ఐ జి.సింహాచలం తెలిపారు.
వృద్ధురాలి ఆత్మహత్య
ఎచ్చెర్ల : ఎస్.ఎస్.ఆర్.పురం గ్రామానికి చెందిన నారాయణమ్మ (75) అనే వృద్ధురాలు చీమల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఏడాది కాలంగా పక్షవాతంతో బాధపడుతున్న ఈమె గ్రామంలోనే చిన్న కుమార్తె దుర్గ ఇంటి వద్ద ఉంటోంది. ఈ నెల 10న ఉదయం ఆమె అపస్మారక స్థితిలో ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. పక్కనే చీమల మందు గిన్నె కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు వృద్ధురాలిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కుమారుడు లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అప్పలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
18న కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష
శ్రీకాకుళం అర్బన్: అర్హత ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని, లోకేష్, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ తమ మాట నిలబెట్టుకొని మెమో 57ను అమలు చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని మెమో 57 సాధన సమితి సమావేశంలో జిల్లా కన్వీనర్ కొత్తకోట శ్రీహరి అన్నారు. శ్రీకాకుళంలోని ఎన్‌జీఓ కార్యాలయంలో జరిగిన మెమో 57 సాధన సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం ప్రతి బాధితుడు తమ తమ ఇంటిలోనే గృహ దీక్షను చేపట్టాలని, అలాగే ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్‌ల వద్ద నిరసన దీక్షను 2003 డీఎస్సీ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా బాధిత ఉద్యోగులు కలెక్టరేట్‌కు అధిక సంఖ్యలో హాజరై పాతపింఛన్ సాధనలో భాగస్వామ్యం కావాలని కోరారు. సమావేశంలో జిల్లా కో కన్వీనర్లు అంబటి లక్ష్మణరావు, అట్టడ తిరుమలేశ్వరరావు, కోర్ కమిటీ సభ్యులు గురుగుబెల్లి భాస్కరరావు, నంబూరి కృష్ణారావు, ఇప్పిలి సురేష్‌కుమార్, దుంపల అనిల్‌బాబు, కె.రామకృష్ణ, ఇ.రమణ, ఫల్గుణరావు తదితరులు పాల్గొన్నారు.

280 మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ

280 మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ