
జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్‌కాలనీలో ఉన్న డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియం వేదికగా జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఎన్‌వీ జ్యూయలర్స్ జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్–2024 పేరిట రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు కిల్లంశెట్టి సాగర్ మాట్లాడుతూ ఆరు విభాగాల్లో పోటీలు జరుగుతాయని, విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మెట్ట అశోక్‌కుమార్, జిల్లా బాడ్మింటన్ సీఈఓ సంపతిరావు సూరిబాబు తదితరులు మాట్లాడుతు టోర్నీ నిర్వహణకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.వి.రమణ, దాతలు కిరణ్‌కుమార్, ఊన్న కిరణ్‌కుమార్, గెంజి భీమారావు, కిమ్స్ సీఓఓ డాక్టర్ రవిసంతోష్, సోలార్ ఎనర్జీ నరసన్నపేట కె.రమణ, శీర రమణ, బ్యాడ్మింటన్ సంఘ ప్రతినిధులు గురుగుబెల్లి ప్రసాద్, ఎంఈ రత్నాజీ, మెండ శాంతికుమార్, సంతోష్‌కుమార్, ఎల్.రవి, గురుగుబెల్లి రవి, శరత్, మోహన్‌సాయి, రిఫరీలు, పీడీలు, సీనియర్ క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
పోటెత్తిన క్రీడాకారులు..
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. సుమారు 400 మంది బాలబాలికలు, సీనియర్ క్రీడాకారులు హాజరై ప్రతిభ చాటారు. అండర్–11, 13, 15, 17, 19 బాలబాలికలకు, అలాగే సీ్త్ర, పురుషులు(సీనియర్స్) విభాగాల్లో సింగిల్స్, డబుల్స్‌లలో పోటీలు జరుగుతున్నాయి. తొలిరోజు రాత్రి 10 గంటల వరకు పోటీలు జరిగాయి. ఆదివారం సాయంత్రంతో పోటీలు ముగుస్తాయని అంతర్జాతీయ క్వాలిఫైడ్ రిఫరీ, టోర్నీ చీఫ్ రిఫరీ సంపతిరావు సూరిబాబు తెలిపారు.