
ఆదిత్యాలయంలో విజిలెన్స్ విచారణ
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రూ.లక్షల్లో అక్రమాలు చేసినట్లుగా అందిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం విజిలెన్స్ సిబ్బంది విచారణ చేపట్టారు. విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు ఆదేశాల మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పలువురి నుంచి వాంగ్మూలాలను స్వీకరించారు. దాదాపుగా రూ.2 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు సమాచారం. భక్తుల దర్శనాల ఏర్పాట్లు, సౌకర్యాలు, ఆలయంలో వివిధ రకాల అభివృద్ధి పనుల పేరిట రూ.లక్షల్లో అక్రమంగా చెక్కులను జారీ చేస్తూ.. ఆలయ నిధులను దారుణంగా తినేశారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
రెగ్యులర్ ఉద్యోగులే టార్గెట్‌గా..
విశాఖపట్నంలో గ్రేడ్–2 ఈవోగా రిటైర్డ్ అయిన జగన్మోహనరావుతో పాటు ఆలయ రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్ కావ్యశ్రీల ప్రమేయంతో రెగ్యులర్ ఉద్యోగుల పేరిట అక్రమంగా చెక్కులు జారీ అయ్యాయని గుర్తించారు. ఎర్రయ్య అనే అటెండర్‌కు తెలియకుండా ఆయన పేరుతో రూ.5 లక్షల విలువైన చెక్కులు, మరో రెగ్యులర్ రికార్డు అసిస్టెంట్ శిమ్మ మల్లేశ్వరరావు పేరిట 19 చెక్కులు, అటెండర్ శ్రీనివాసరావు పేరుతో సుమారు 4 చెక్కులు, స్వీపర్ నీలయ్య పేరుతో 2 చెక్కులతో పాటు ఆలయంలో సిమ్మెంట్ పనులు చేసే మేస్త్రి కునుకు రాము అనే వ్యక్తి పేరిట ఏకంగా 9 చెక్కులు, దినసరి పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్న బుజ్జి పేరిట మరో 4 చెక్కుల వరకు జారీ చేసేశారు. ఆయా రెగ్యులర్ ఉద్యోగుల సంతకాలు కూడా ఫోర్జరీవిగా పేర్కొంటున్నారు. దీంతో పాటు ఆలయంలో విద్యుత్‌తో పాటు పలు రకాల పనులను కాంట్రాక్ట్ విధానంలో చేస్తున్న క్లాస్–1 కాంట్రాక్టర్ ఉంగటి పాపారావు వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. మిగిలిన చెక్కులన్నీ ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారుల పేరుతో జారీ చేశారు.
వివాదాస్పదంగా వాంగ్మూలాల స్వీకరణ..
విజిలెన్స్ అధికార సిబ్బంది.. తమ జిల్లా కార్యాలయంలో వాంగ్మూలాలను స్వీకరించకుండా ఆలయ కార్యాలయంలో కూర్చుని వాంగ్మూలాలను దగ్గరుండి రాయించడం వివాదాస్పదమయ్యింది. అక్రమాలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను ముందున కూర్చోబెట్టుకుంటే వాస్తవాలను ఎలా చెప్పగలమని కొందరు దినసరి వేతనదారులు ఆక్షేపించారు. ఇప్పటికై నా విజిలెన్స్ ఉన్నతాధికారులు తమదైన శైలిలో విచారించి ఆలయంలో అక్రమాల నిగ్గు తేల్చాలని పలువురు కోరుతున్నారు.