
గ్యాస్ లీకై ఇద్దరికి గాయాలు
ఆమదాలవలస: పురపాలక సంఘ పరిధిలోని మెట్టక్కివలస పదో వార్డు వాంబే కాలనీలో గ్యాస్ లీకై ఇద్దరు గాయాల పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వాంబే కాలనీకి చెందిన గుంటుకు సరస్వతి టిఫిన్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఇంట్లో టిఫిన్ తయారు చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎదురు ఇంట్లో నివసిస్తున్న కోలా మాధవరావు ఘటనా స్థలానికి వెళ్లి మంటలు ఆర్పడానికి ప్రయత్నించగా ఆయన కూడా గాయాల పాలయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.70 వేల నష్టం జరిగినట్లు సమాచారం. ఎస్సై ఎస్.బాలరాజు సైతం ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. గ్యాస్ సిబ్బంది పరిశీలించి బాధితురాలితో మాట్లాడారు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
బూరగాంలో కలకలం
టెక్కలి : బూరగాం గ్రామంలో శుక్రవారం కలకలం రేగింది. ఓ ఇంటికి నిత్యం కొంతమంది యువతీ యువకులు వస్తూ పోతుంటారని, ఓ మహిళ చీకటి వ్యవహారం నిర్వహిస్తోందంటూ స్థానికులు ఇంటికి ఇరువైపులా తాళాలు వేసి నిర్బంధించారు. సమాచారం తెలుసుకున్న ఏఎస్‌ఐ కేశవరావు, సిబ్బంది గ్రామానికి చేరుకుని మహిళతో పాటు ఇంట్లో నిర్బంధించిన ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, గ్రామస్తులు నిర్బంధించిన వారంతా తనకు తెలిసినవారేనని ఆ మహిళ చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు.