
టీచర్లను బోధనకే పరిమితం చేయాలి
శ్రీకాకుళం న్యూకాలనీ : ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పూజారి హరిప్రసన్న విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని రైతుబజారు కూడలిలోని విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఉమ్మడి జిల్లా పూర్వ అధ్యక్షులు కొమ్ము అప్పలరాజుతో కలిసి ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. యోగా దినోత్సవం, మెగా పేరెంట్స్ వంటివి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులకు న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలు చెల్లించకుండా అనవసరమైన కార్యక్రమాలతో బోధనకు ఆటంకం కలిగిస్తున్నారని దుయ్యబట్టారు. పెండింగ్ డీఏలు, బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా ఇన్‌చార్జిలు గురుగుబెల్లి రాజశేఖర్, ఎన్నిప్రసాద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.