
తప్పిన పెనుప్రమాదం
జి.సిగడాం: వాండ్రంగి రైల్వే వంతెనపై అతివేగంతో వస్తున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జైపోయింది. స్థానిక ఎస్‌ఐ వై.మధుసూదనరావు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం రాగోలు సమీపంలో ఉన్న గూడెం గ్రామం నుంచి రాకేష్ అనే వ్యక్తి కారుతో రాజాం వైపు వెళ్తున్నాడు. రైల్వే వంతెనపై ముందు ఉన్న టాక్టర్‌ను ఢీ కొట్టడంతో కారు ముందు భాగం ధ్వంసమైపోయింది. రాకేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 108 సాయంతో ఆయనను పొందూరు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
విషం తాగి యువకుడు మృతి
రణస్థలం: మండలంలోని కమ్మసిగడాం పంచాయతీలో గల లోచర్లపాలెం గ్రామానికి చెందిన సింక శ్యామలరావు(29) విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జేఆర్‌పురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా శ్యామలరావు గురువారం సాయంత్రం లోచర్లపాలెం గ్రామ సమీపంలో విషం తాగేశాడు. అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో స్థానికులు కొండములగాం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుని అన్నయ్య వరప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్ పురం ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.