
ట్రిపుల్ ఐటీ దరఖాస్తుల స్వీకరణకు 20 చివరి తేదీ
ఎచ్చెర్ల క్యాంపస్: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ)ల్లో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 20 చివరి తేదీ. నాలుగు క్యాంపస్‌లు శ్రీకాకుళం, ప్రకాశం, న్యూజివీడు, ఇడుపులపాయలకు కలిపి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యను అందిస్తారు. 10వ తరగతి మార్కు లు, రిజర్వేషన్ రోస్టర్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వెయిటేజ్ వంటి నిబంధనలకు లోబడి ప్రవేశాలు కల్పిస్తారు. నాలుగు క్యాంపస్‌లకు ఆన్‌లైన్‌లో ఒకే దరఖాస్తు సరిపోతుంది. ప్రాధాన్యత ఇచ్చుకోవాల్సి ఉంటుంది. జూన్ 5వ తేదీన మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు.
రేషన్.. పరేషాన్
సారవకోట: మండలంలోని బుడితి చిన్నవీధికి చెందిన రేషన్ కార్డుదారులకు గత నెల రేషన్ సరుకులు పూర్తి అందజేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వీధిలో ఉన్న సుమారు 50 మంది కార్డుదారులకు రేషన్ సరుకులు గత నెల అందజేయలేదని, అలాగే గత నెలో అక్కడక్కడ ఇచ్చిన రేషన్ కార్డు దారులకు ఈ నెల లో ఒక్కో కిలో బియ్యం చొప్పున తగ్గించారని నేతింటి సూర్యనారాయణ, ముద్దాడ హేమలత, రెడ్డి ముసలయ్య, పొన్నాన తాతారావులతో పాటు పలువురు ఆరోపిస్తున్నారు. దీని పై సీఎస్‌డీటీ షరీఫ్‌కు వివరణ కోరగా గత నెలలో రేషన్ సరుకులు అందలేదని తమ దృష్టికి రాలేదని దీనిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఏపీఆర్డీసీలో విద్యార్థి ప్రతిభ
నరసన్నపేట: స్థానిక మారుతీ నగర్‌కు చెందిన అడపా విజయ్ ఏపీఆర్డీసీ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. స్థానిక సంపత్ సాయి జూనియర్ కళాశాల్లో ఇంటర్ చదివిన విజయ్ డిగ్రీలో రెసిడెన్షియల్ కళాశాలల్లో చదివేందుకు ఎంట్రన్స్ పరీక్ష రాయగా బుధవారం ఫలితాలు వచ్చాయి. దీంట్లో విజయ్ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం పొందాడు. విజయ్ తండ్రి సింహాచలం లారీ డ్రైవర్ కాగా తల్లి గృహిణి. తమ కుమారుడు ఏపీఆర్డీసీలో ర్యాంకు పొందడంపై ఆనందం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ గణపతిరావు అభినందించారు.
జ్ఞానరూపేశ్‌కు మూడో స్థానం
స్థానిక సంపత్‌సాయి కళాశాల విద్యార్థి జ్ఞాన రూపేష్ శర్మ ఏపీఆర్డీసీలో మూడో ర్యాంకు పొందాడు. సారవకోటకు చెందిన శర్మ తల్లిదండ్రులు కృష్ణసాయిరాం, పద్మావతి ఆనందం వ్యక్తం చేశారు.

ట్రిపుల్ ఐటీ దరఖాస్తుల స్వీకరణకు 20 చివరి తేదీ