
నర్సింగ్ కళాశాలకు.. నిబంధనలు పట్టవా..?
శ్రీకాకుళం:
జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న నర్సింగ్ కాలేజీకి ప్రభుత్వ నిబంధనలు పట్టడం లేదు. ఇటీవల మంగళవారం ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని నిబంధనలకు విరుద్ధంగా విజయవాడకు పంపించగా, అక్కడ సదరు ఉద్యోగి మృత్యువాతపడిన విషయం పాఠకులకు విధితమే. ఈ విషయం సాక్షిలో ప్రచురితమైన అనంతరం అక్కడి విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
లేడీస్ హాస్టల్లో
పురుషులకు డ్యూటీ
నర్సింగ్ కాలేజీ హాస్టల్లో యువతులు ఉండగా.. ఇక్కడ పురుష ఉద్యోగులకు సెలవు రోజుల్లో డ్యూటీలను వేస్తున్నారు. రొటేషన్ పద్ధతిపై వారికి డ్యూటీలను వేస్తూ కళాశాల ప్రిన్సిపాల్, సీనియర్ అసిస్టెంట్ అజయ్ సంతకాలతో సర్క్యూలర్‌లను కూడా జారీ చేస్తున్నారు. వాస్తవానికి బాలికలు, యువతులు, మహిళల విద్యాసంస్థల్లో గానీ, హాస్టల్స్‌లో గానీ 55 ఏళ్లలోపు ఉన్న పురుషులను విధుల్లో నియమించకూడదన్న నిబంధనలు ఉన్నాయి. దీనిని పట్టించుకోకుండా 27 ఏళ్ల వయసున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను సెలవు రోజుల్లో డ్యూటీలకు వేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
వార్డెన్ లేకుండా వసతి గృహం
ఇదిలా ఉండగా హాస్టల్‌ను వార్డెన్ లేకుండానే నడిపిస్తున్నారు. నాలుగు నెలల క్రితం అవుట్ సోర్సింగ్ పద్ధతిపై ఒక మహిళను వార్డెన్‌గా నియమించారు. ఆమె విధుల్లో చేరిన తర్వాత 24 గంటలపాటు హాస్టల్లో ఉండాలని, బయటకు వెళ్లేందుకు వీళ్లేదని ప్రిన్సిపాల్ నిబంధనలు విధించారు. దీంతో వారం రోజుల్లోనే ఆమె ఉద్యోగం నుంచి వైదొలిగినట్లు పలువురు చెబుతున్నారు. నర్సింగ్ కళాశాలలో ఒక ప్రిన్సిపాల్, ఒక ట్యూటర్, సూపరింటెండెంట్, ఏవో, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు రెగ్యులర్ ఉద్యోగులు కాగా, వీరిలో 70 శాతం మంది విజయనగరం, విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరెవరూ సెలవు రోజుల్లో ఇక్కడ ఉండకపోవడం వలన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిబంధనలకు విరుద్ధంగా డ్యూటీలు వేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. వీరెవరికీ విజయవాడ వెళ్లడం ఇష్టంలేకపోవడంతో కిశోర్‌ను విజయవాడ పంపించారని పలువురు చెబుతున్నారు. ఆయనను విజయవాడ పంపించిన విషయంలోనూ నిబంధనలు పాటించలేదు. కాన్ఫిడెన్షియల్ సమాచారం పంపించినప్పుడు అందుకు సంబంధించిన సమాచారం రిజిస్ట్రార్‌లో నమోదు చేసి సంబంధిత ఉద్యోగితో సంతకం చేయించుకోవాల్సి ఉంటుంది. అతడిని కార్యాలయం పనిమీద ఎక్కడికి పంపిస్తున్నారో మూమెంట్ రిజిస్ట్రార్‌లో నమోదు చేసి సంబంధిత ఉద్యోగితో పాటు కాలేజీ యాజమాన్య ప్రతినిధి కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. అతడిని పంపిస్తున్నట్లు ఒక లేఖను సిద్ధం చేసి ఉద్యోగికి ఇవ్వాలి. అలాగే టీఏ, డీఏగా అడ్వాన్స్ చెల్లిస్తే దాన్ని నమోదు చేయాలి. కానీ కిశోర్ విషయంలో ఇవేవీ పాటించలేదు. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపిస్తే నిబంధనలు పాటించకుండా జరుగుతున్న అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కళాశాలలో నిబంధనలకు నీళ్లు
స్థానికంగా ఉండని రెగ్యూలర్ ఉద్యోగులు
డ్యూటీలతో అవుట్ సోర్సింగ్
ఉద్యోగులకు ఇబ్బందులు
లేడీస్ హాస్టల్
పరిశీలనకు నియామకం
సెలవు రోజుల్లో విద్యార్థినులు ఔటింగ్ అంటూ బయటకు వెళ్తారు. వారు సరైన సమయానికి వస్తున్నారా.. లేదా అనే పరిశీలన కోసమే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమిస్తున్నాం.
– ఝాన్సీలక్ష్మి, ప్రిన్సిపాల్, నర్సింగ్ కాలేజీ

నర్సింగ్ కళాశాలకు.. నిబంధనలు పట్టవా..?

నర్సింగ్ కళాశాలకు.. నిబంధనలు పట్టవా..?