
యువగళం హామీలు ఏమయ్యాయి?
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పేరిట విద్యార్థుల కోసం అనేక అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా అమలు చేయడం లేదని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బోర గోపి మండిపడ్డారు. ఏడాది కావస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పందించకపోవడం దారుణమన్నారు. యువగళం హామీలు ఏమయ్యాయంటూ జిల్లా కేంద్రంలోని సూర్యమహాల్ కూడలిలో స్వామి వివేకానంద విగ్రహం వద్ద గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కన్వీనర్ మాట్లాడుతూ లోకేష్ విద్యాశాఖ మంత్రి కాదని, ఫేక్ మినిస్టర్ అని ఎద్దేవా చేశారు. విద్యా సంసవత్సం బకాయిలు వెంటనే చెల్లించి విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్రకార్యవర్గ సభ్యులు మదన్, శ్రీకాకుళం మండల కన్వీనర్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.