
వేలానికి వేళ కాలేదా?
జలుమూరు : ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో భూముల సాగు వేలం జరగక ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఏడాదిన్నర కావస్తున్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేలం జరగడం లేదు. శ్రీముఖలింగేశ్వర స్వామి పేరిట సుమారు 24 ఎకరాలు సాగు భూమి ఉంది. మూడున్నరేళ్ల క్రితం ఎకరాకు రూ.21 వేలు చొప్పున ముందు కౌలుకు పాట పాడేవారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి స్వామివారి భూములకు సంబంధించి దేవదాయ శాఖ అధికారులు బహిరంగ వేలంపాట నిర్వహించేవారు. ఎక్కువ మొత్తం పాడిన రైతులకు వాటి సాగుకు అనుమతిచ్చేవారు.
జాప్యమెందుకో?
దేవదాయ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఏడాదిన్నర గడుస్తున్నా పాట నిర్వహించడంలేదని గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు. గత ఏడాదితోపాటు ఈ ఏడాది కూడా కౌలుసాగుకు ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే దేవదాయ శాఖ నుంచి మాత్రం ఎటువంటి పాట నిర్వహించడం లేదని రైతులు చెబుతున్నారు. వేలం నిర్వహించి ఇందులో కొంత భాగం మొత్తం ముందుగానే బ్యాంక్ ఖాతాలో జమ చేయాలి. అన్ని నిబంధనలకు లోబడి కౌలు వేలం పాడేందుకు ఈ ఏడాది రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ కాలం కూడా ప్రారంభమైంది. ఇదే సమయంలో వేలం నిర్వహిస్తే ముందస్తు పనులు చేసేందుకు వీలు కలుగుతుందని రైతులు చెబుతున్నారు.
ప్రతిపాదనలు పంపిస్తాం..
శ్రీముఖలింగేశ్వర ఆలయ భూములు కౌలుకు సంబంధించి దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తాం. అక్కడి నుంచి అనుమతి వచ్చాక కౌలుకు వేలం నిర్వహిస్తాం.
– పి.ప్రభాకరరావు, ఈఓ,
శ్రీముఖలింగం దేవస్థానం
ఏడాదిన్నరగా జరగని శ్రీముఖలింగం భూముల కౌలు వేలం
అధికారులు నిర్లక్ష్యం వీడాలంటున్న రైతులు
జాప్యం కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి