
వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన
ఇచ్ఛాపురం రూరల్/సోంపేట: బూర్జపాడు నుంచి డొంకూరు మత్స్యకార గ్రామం మధ్య రెండు నూతన వంతెనల నిర్మాణానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బూర్జపాడు నుంచి పెద్ద లక్ష్మీపురం వరకు 5.45 కిలోమీటర్ల పొడవున రూ.486 లక్షలతో ప్రధానమంత్రి సడక్ యోజన కింద తారురోడ్డు నిర్మాణం చేపట్టారు. అదే సమయంలో పీఎంజీఎస్‌వై పథకం ద్వారా డొంకూరు ఉన్నత పాఠశాల వద్ద నూతన వంతెన నిర్మాణానికి రూ.6కోట్ల 30 లక్షలు, బూర్జపాడు ఉప్పుటేరు(కాజ్‌వే)పై రూ.10 కోట్ల 50 లక్షలతో మరో వంతెన నిర్మాణానికి రెండు సార్లు టెండర్లు వేసినప్పటికీ కంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అదే నిధులతో శనివారం వంతెన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జిల్లాలో 110 మత్స్యకార గ్రామాల వద్ద మత్స్య సాగర పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం రూ.4కోట్లు నిధులు మంజూరు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పండ్కర్ తదితరులు పాల్గొన్నారు. సోంపేట మండలంలోని కొండిరేవు వంతెన, మహేంద్ర తనయ వంతెనలకు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎమ్మెల్యే బి.అశోక్ శనివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్, సర్పంచ్ యర్ర రజని, బారువ గ్రామస్తులు పాల్గొన్నారు.