
కలెక్టర్ గ్రీవెన్స్‌కు 165 వినతులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల ఫిర్యాదులు ఆలస్యం కాకుండా పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్(గ్రీవెన్స్) కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వివిధ సమస్యలపై 165 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని నిర్ణీత గడువులోపే పరిష్కరించాలన్నారు. ఆలస్యం చేసే వారిపై చర్యలు తప్పవన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో కొన్ని శాఖలు వెనుకబడి ఉన్నాయని.. ఆయా విభాగాల అధికారులు తీరు మార్చుకోవాలన్నారు. పరిష్కారం సాధ్యపడని ఫిర్యాదులకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
సప్లిమెంటరీ పరీక్షలకు అవకాశం కల్పించాలి
● కుప్పిలి మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రంలో అన్యాయంగా డీబారైన ఐదుగురు విద్యార్థులకు మే నెలలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలు పరీక్ష రాయడానికి అనుమతి మంజూరు చేయాలని ప్రజా సంఘాల ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు.
● దివ్యాంగులకు, దీర్ఘకాలిక రోగులకు పింఛను మంజూరి చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే తమకు పింఛన్ మంజూరు చేయాలని ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటకు చెందిన యతిరాజుల ఢిల్లేశ్వశ్వరరావు తదితరులు వినతిపత్రం అందించారు.