
తండ్రీకుమార్తెలపై దాడి
సంతబొమ్మాళి: మండలంలోని బోరుభద్ర పంచాయతీ గొదలాం గ్రామంలో తండ్రీకుమార్తెలపై దాడి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిట్ట పాపారావు ఆరో తరగతి చదువుతున్న తన కుమార్తె లక్ష్మిప్రియతో కలిసి స్కూటీపై బోరుభద్రలో ఉన్న వివేకానంద పాఠశాలకు బయలుదేరారు. మార్గమధ్యలో అదే గ్రామానికి చెందిన పిట్ట ముఖలింగం ఇనుప రాడ్డుతో వెనుక నుంచి దాడి చేయడంతో పాపారావుతో పాటు కుమార్తె కింద పడిపోయారు. కిందపడిన తండ్రీకుమార్తెలపై ముఖలింగంతో పాటు పిట్ట లక్ష్మణరావు, రామారావులు కర్రలతో దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు. అక్కడే ఉన్న స్థానికులు అడ్డుకొని బాధితులకు సపర్యలు చేసి 108 అంబులెన్సులో కోటబొమ్మాళి ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిగత, ఆస్తి తగదా వల్లే దాడి జరిగిందని సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంతబొమ్మాళి ఎస్‌ఐ సింహాచలం తెలిపారు.
బాక్సింగ్ పోటీల్లో చరణ్‌కు కాంస్యం
శ్రీకాకుళం న్యూకాలనీ: యూత్ బాక్సింగ్ పోటీల్లో సిక్కోలు కుర్రాడు ఎ.చరణ్‌కుమార్ సత్తాచాటాడు. విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో ఈ నెల 12 నుంచి 14 తేదీల్లో జరిగిన 7వ ఏపీ రాష్ట్రస్థాయి యూత్ మెన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్–2025 పోటీల్లో లైట్ మిడిల్ వెయిట్ విభాగంలో కాంస్య పతకంతో మెరిశాడు. శ్రీకాకుళంలోని మాస్టర్స్ మైండ్స్ వారియర్స్(ఎంఎండబ్ల్యూ) బాక్సింగ్ క్లబ్‌కు చెందిన ఈ కుర్రాడు కోచ్ కె.పురుషోత్తంరావు పర్యవేక్షణలో ఇటీవల అనేక బాక్సింగ్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించాడు. తాజాగా కాంస్య పతకం సాధించడం పట్ల బాక్సింగ్‌క్లబ్ అధ్యక్షుడు టి.తారకనాథ్, కార్యదర్శి బి.సురేష్‌కుమార్, కోచ్ పురుషోత్తం, క్లబ్ ప్రతినిధులు, డీఎస్‌డీఓ డాక్టర్ శ్రీధర్‌రావు తదితరులు హర్షం వ్యక్తంచేశారు.
సన్నధాన్యాన్ని మద్దతు ధరకు కొనాల్సిందే
పోలాకి: ‘చిన్నబోయిన సన్నాలు’ శీర్షికన మంగళవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు. జిల్లాలో పలు మిల్లుల్లో సన్నధాన్యం, బియ్యం, నూకలు తదితర స్టాకులను తనిఖీ చేశారు. వాటా, నిల్వ తదితర అంశాలను తెలియజేసే ఏ, బి రిజిస్టర్లను పరిశీలించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. అదే విధంగా వ్యవసాయశాఖ అధికారులకు సైతం క్షేత్రస్థాయిలో వార్తకు సంబంధించిన అంశంపై ఉన్నతాధికారులు వివరణ కోరినట్లు తెలిసింది. కాగా, రబీకి అందివచ్చిన సన్నధాన్యం ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయడానికి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు లేవని అధికారులు తెలిపారు. ఏదిఏమైనా ప్రభుత్వం ఎగుమతులకు అనుమతిస్తే తప్ప ధాన్యం కొనుగోలులో అనుకున్న స్థాయి మార్కెట్‌ధర పలకదని పలువురు వ్యాపారులు చెబుతున్నారు.
ఎన్‌సీడీఆర్‌సీ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్‌సీడీఆర్‌సీ)లో ఇద్దరు సభ్యుల ఖాళీల భర్తీకి భారత ప్రభుత్వ వినియోగదారుల శాఖ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయని జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు రఘుపాత్రుని చిరంజీవి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు జడ్జి/పదేళ్ల అనుభవం గల జిల్లా జడ్జి/జిల్లా అదనపు జడ్జి/వ్యాపార న్యాయ ఆర్థిక అకౌంటింగ్ తదితర రంగాలలో 25 ఏళ్ల పైబడి అనుభవము కలిగిన 50 ఏళ్ల పైబడిన వారు అర్హులని పేర్కొన్నారు.
మద్యం బాటిళ్లు పట్టివేత
రణస్థలం: మండలంలోని నెలివాడ సమీపంలో బీహర్ దాబా వద్ద పాన్‌షాప్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మనోజ్ అనే వ్యక్తిని జె.ఆర్.పురం పోలీసులు పట్టుకున్నారు. సోమవారం అర్ధరాత్రి సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టి 16 బీర్ బాటిళ్లు స్వాదీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని మంగళవారం రిమాండ్‌కు తరలించామని జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు.

తండ్రీకుమార్తెలపై దాడి

తండ్రీకుమార్తెలపై దాడి

తండ్రీకుమార్తెలపై దాడి