
ఉపాధిలో మూడో స్థానం
శ్రీకాకుళం పాతబస్టాండ్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి జిల్లా రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచిందని కలెక్టర్ స్విప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఎన్‌ఐసీ పోర్టల్ గణాంకాలు ప్రకారం సిమ్మెంట్, మెటల్ రోడ్ల నిర్మాణం, సిమ్మెంట్ కాలువల నిర్మాణం, పాఠశాలల ప్రహరీల నిర్మాణం తదితర పనులు చేపట్టినట్టు తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరం 2025– 26లలో ‘పంచ ప్రాధాన్యాలు‘ అనే భావనతో పశువులకు నీటి తొట్టెలు, సేద్యపు నీటి కుంటలు, పంట కాలువలను పునరుద్ధరించడం, చెరువులు / కుంటలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, దినసరి వేతనం రూ.307కు పెంచడం చేస్తామన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రణాళిక ప్రక్రియలో రూ.1499.03 కోట్ల అంచనా విలువతో 41523 పనులను గుర్తించామన్నారు.
జిల్లా ఆస్పత్రి సందర్శన
టెక్కలి రూరల్: స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని మంగళవారం రాష్ట్రస్థాయి కాయకల్ప టీమ్ సందర్శించింది. ఇందులో భాగంగా ఆస్పత్రిలోని పలు వార్డులు, ల్యాబ్‌లు పరిశీలించారు. అలానే ఆస్పత్రి పరిసరాలు, మరుగుదొడ్లు పరిశుభ్రత వంటిని పరిశీలించారు. అనంతరం వార్డుల్లో రోగులకు ఉండే పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి చుట్టుపక్కల వాతవరణం పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాయకల్ప టీమ్ సభ్యులు డాక్టర్ సౌజన్య, పి.కమలాకర్‌లతో పాటు ఆస్పత్రి సూపరిండెంటెంట్ బి.సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
నీటి తొట్టెలు నిర్మించాలి: కలెక్టర్
నరసన్నపేట: వేసవి తీవ్రత దృష్ట్యా గ్రామాల్లో పశువులకు ఇతర జంతువులకు మంచి నీరు అందించాలని, ఈ మేరకు నీటి తొట్టెలు నిర్మించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మండలంలోని తామరాపల్లిలో నీటి తొట్టెల పనులను ఆయన మంగళవారం ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాల్లో నీటి తొట్టెలు నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. ఒక్కో నీటి తొట్టెకు రూ. 30 వేలు ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. దీంట్లో భాగంగా నరసన్నపేట మండలంలో 16 నీటి తొట్టెలు మంజూరు చేశారని, ఈ పనులు చురుగ్గా నిర్వహిస్తున్నామన్నారు. అలాగే తామరాపల్లి గ్రామంలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ బి.మధుసూదనరావు, ఏపీఓ యుగంధర్‌లతో పాటు గ్రామస్తులు ముచ్చ గనేష్, గొద్దు జగన్మోనరావు తదితరులు పాల్గొన్నారు.
రిమ్స్ ఈ లైబ్రరీలో అగ్నిప్రమాదం
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాలలోని ఈ లైబ్రరీలో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రంథాలయంలోని ఏసీలో షాట్ సర్క్యూట్ జరగడంతో పొగలు వచ్చా యి. దీంతో కళాశాల ఆవరణలో ఉన్న అగ్నిమాపక యంత్రంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది ప్రయత్నించారు. అప్పటికే అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందడంతో వారు వచ్చి, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ఈ ప్రమాదంలో గ్రంథాలయంలో ఉన్న పలు కంప్యూటర్లు పనికి రాకుండా పోయినట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఆ సమయంలో గ్రంథాలయంలో ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.

ఉపాధిలో మూడో స్థానం

ఉపాధిలో మూడో స్థానం