టీచర్లకు వెబ్‌ ఆధారిత బదిలీలు వద్దు | - | Sakshi
Sakshi News home page

టీచర్లకు వెబ్‌ ఆధారిత బదిలీలు వద్దు

Mar 5 2025 12:47 AM | Updated on Mar 5 2025 12:45 AM

● మాన్యువల్‌గానే నిర్వహించాలి ● ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి రమణ

శ్రీకాకుళం న్యూకాలనీ: వెబ్‌ కౌన్సిలింగ్‌, వెబ్‌ ఆధారిత బదిలీల పట్ల తమకు నమ్మకం లేదని, మాన్యువల్‌ విధానంలోనే కౌన్సిలింగ్‌ నిర్వహించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి రమణ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని దాసరి క్రాంతిభవన్‌లో మంగళవారం ఉపాధ్యాయ బదిలీల చట్టం డ్రాఫ్ట్‌పై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాన్యువల్‌ విధానమే కావాలంటూ రాష్ట్రంలో లక్షలాది మంది ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నా విద్యాశాఖ ఉన్నతాధికారులు తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. తాజాగా విడుదల చేసిన డ్రాఫ్ట్‌లో సైతం వెబ్‌ ఆధారిత కౌన్సిలింగ్‌ విధానమే ఉంటుందని ఉన్నతాధికారులు తెలియజేయడాన్ని ఎస్టీయూ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెబ్‌ కౌన్సిలింగ్‌లో వేలాది ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని.. సెకండ్‌ గ్రేడ్‌ ఉపాధ్యాయులైతే.. ఒక జిల్లాలో 3,500 నుంచి 5వేల సంఖ్య వరకు సీనియారిటీ లిస్టు ఉంటుందన్నారు. అందులో చివర ఉన్న వ్యక్తులు 4వేల వరకూ పాఠశాలకు ఆప్షన్స్‌ ఇవ్వడం దాదాపు అసాధ్యమని, ఇదెంతో తీవ్రమైన ఒత్తిడితో కూడిన అంశం కాదా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దాదాపు 98 వేల మంది సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు వెబ్‌ కౌన్సలింగ్‌ వద్దని మొరపెట్టుకుంటున్నా వినిపించుకోకుండా విద్యాశాఖాధికారులు ఎవరి ప్రయోజనాలు కోసం వెబ్‌ కౌన్సలింగ్‌లో బదిలీలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికై నా కూటమినేతలు, విద్యాశాఖ మంత్రి కలుగజేసుకొని ఉన్నతాధికారులు ఒంటెద్దు పోకడలను నిలువురించకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించకతప్పదని స్పష్టం చేశారు. అనంతరం మండలాల నాయకులు, పలువురు ఉపాధ్యాయులు డ్రాఫ్ట్‌ చట్టంపై ఉన్న అభ్యంతరాలను ప్రొఫార్మాలో నింపి పాఠశాల విద్యాశాఖకు మెయిల్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పి.రామకృష్ణ, కె.శ్రీనివాసరావు, జి.శ్రీను, ఎం.తేజ, చింతల రామారావు, చౌదరి జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement