
కుమార్తె మృతదేహంతో విలపిస్తున్న తల్లి
మెళియాపుట్టి: మండల కేంద్రం మెళియాపుట్టిలో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఎస్‌ఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మారడికోట పంచాయతీ చీడిపాలెం గ్రామానికి చెందిన సవరకేశమ్మ(29)కు పదేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన మేనమామ భాస్కరరావుతో వివాహమైంది. వీరికి కుమార్తె అస్మిత, కుమారుడు చక్రవర్దన్ ఉన్నారు. కుటుంబ కలహాలతో కేశమ్మ భర్తకు దూరంగా ఉంటూనే గ్రామంలో వలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది. కుమార్తెతో కలిసి మెళియాపుట్టి పొందర వీధిలోని అద్దె ఇంటిలో నివాసముంటోంది. శుక్రవారం మధ్యాహ్నం ఏం జరిగిందో గానీ ఇంటి వద్ద బొద్దింకల మందు తాగింది. అనంతరం తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే తల్లి వచ్చి కేశమ్మను మెళియాపుట్టి పీహెచ్‌సీకి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది. కాపురానికి వెళ్లమని కుటుంబ సభ్యులు చెబుతున్నా వినకుండా మొండిగా వ్యవహరించానని, అందుకే జీవితం ఇలా అయిపోయిందని ఎప్పటికప్పుడు బాధపడుతూ చెబుతూ ఉండేదని, అదే తలచుకుంటూ మనస్తాపానికి గురై ఇలా చేసిందని తల్లి చెబుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాతపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.