
నైరా చానెల్‌లో పేరుకుపోయిన గుర్రపు డెక్క
అరసవల్లి: అరసవల్లి ఆదిత్య క్షేత్రానికి ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గర్భాలయంలో స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు తమ ఆరోగ్యాల కోసం సూ ర్యనమస్కార పూజలను చేయించుకున్నారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా ఈవో వి.హరిసూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వత్సవలస యాత్ర సందర్భంగా ఆదివారం సాయంత్రం కూడా భక్తులు ఆదిత్యుడిని దర్శించుకున్నారు. టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి ఆలయంలో సూర్యనమస్కార పూజలను చేయించుకున్నారు. ఆలయ పాలకమండలికి ఎంపికై న ఎన్.కోటేశ్వర చౌదరి కూడా స్వామిని దర్శించుకున్నారు. ఒక్కరోజులో వివిధ దర్శనాల టిక్కెట్ల ద్వారా రూ. 3,63,500, విరాళాల రూపంలో రూ.90,429, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.2.20 లక్షల వరకు ఆదాయం లభించినట్లుగా ఈఓ తెలిపారు.
అడవిదుప్పి దాడిలో
పారా మిలటరీ జవాను మృతి
కోటబొమ్మాళి: సంతబొ మ్మాళి మండలం నర్సపురం పంచాయతీ ఆకులసతివానిపేట గ్రామానికి చెందిన పారామిలటరీ జవాన్ రొక్కం లక్ష్మ ణ్ (36) అడవి దుప్పి దాడిలో మృతి చెందారు. ప్రస్తుతం లక్ష్మణ్ భార్యపిల్లలు కోటబొమ్మాళిలోని విద్యుత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. అస్సోంలోని గుస్సాయిగాం పారామిలటరీ 31 బెటాలియన్‌లో సహస్రసీమాబల్ జవానుగా లక్ష్మణ్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన విధి నిర్వహణలో ఉండగా అకస్మాత్తుగా ఆయనపై అడవి దుప్పి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అపస్మారక స్థితికి వెళ్లిపోయిన లక్ష్మణ్‌ను సహోద్యోగులు సమీప ఆస్పత్రిలో చేర్పించగా.. అక్కడే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. జవాన్ మృతదేహాన్ని అస్సోం నుంచి విశాఖపట్నం వరకూ విమానంపై తెచ్చి అక్కడ నుంచి మిలటరీకి చెందిన వ్యాన్‌లో కోటబొమ్మాళిలోని నివాసానికి ఆదివారం సాయంత్రం తీసుకువచ్చారు. కోటబొ మ్మాళి తహసీల్దార్ జామి ఈశ్వరమ్మ మృతదేహం వద్ద నివాళులర్పించారు. అనంతరం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
గుర్రపు డెక్కతో ఇబ్బందులు
ఆమదాలవలస రూరల్: మండలంలో చెవ్వాకులపేట గ్రామం సమీపంలో గల నైరా చానెల్‌లో(సాగునీటి ప్రధాన కాలువ) గుర్రపు డెక్క పేరుకుపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం రబీ సీజన్‌లో భాగంగా ఆమదాలవలస మండలంలో చెవ్వాకులపేట, పొన్నాంపేట రామచంద్రాపురం, సరుబుజ్జిలి మండలంలో పురుషోత్తపురం, ఫకీర్‌సాహెబ్‌పేట, అల్మాజీపేట, శ్రీకాకుళం మండలంలోని నైర, పొన్నాం, బట్టేరు గ్రామాల్లో మొక్కజొన్న, రాగులు, అపరాలు, వరి, నువ్వుల పంటలను సుమారు 1500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంటలకు సాగునీరు అందించే నైరా చానెల్‌లో గుర్రపు డెక్క వల్ల సాగునీరు అందకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. ఏటా ఖరీఫ్, రబీ పంటలకు ప్రధానంగా సాగునీరు అందించే 13.35 కిలోమీటర్ల మేర ఉన్న ఈ కాలువ పూడుకుపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేసవిలో యంత్రాల ద్వారా గుర్రపు డెక్కను తొలగిస్తే రైతులకు కొంత మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత వంశధార జేఈ పి.కృష్ణకిశోర్‌ను వివరణ కోరగా వచ్చే ఖరీఫ్ ముందు గుర్రపు డెక్కను తొలగించే ఏర్పాటు చేస్తామని అన్నారు. గుర్రపు డెక్క తొలగించడానికి కావా ల్సిన నిధుల కోసం అంచనాలు వేసి ప్రతిపాదనలు పంపామని, నిధులు విడుదలైతే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

లక్ష్మణ్(ఫైల్)