జోరుగా ఇసుక దందా | - | Sakshi
Sakshi News home page

జోరుగా ఇసుక దందా

Jun 1 2026 7:23 AM | Updated on Jun 1 2026 7:23 AM

పరిగి: పెన్నా, జయమంగళీ నదుల్లో ఇసుక ఖాళీ అవుతోంది. ఇష్టారీతిలో తవ్వకాలు చేపట్టి అందిన కాడికి దోచుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు, పాలకులు కూడా చోద్యం చూస్తుండటంతో ఇసుకాసురుల వ్యాపారం మూడు పువ్వులు... ఆరు కాయలుగా సాగుతోంది.

ట్రాక్టర్‌ రూ.2 వేలు

పరిగి మండల పరిధిలో పెన్నా, జయమంగళి నదులు అక్రమార్కులకు కనకవర్షం కురిపిస్తున్నాయి. ఒక్కో ట్రాక్టర్‌ ఇసుక ధర స్థానికంగా అయితే రూ.2 వేలు. అదేవిధంగా కర్ణాటకకు రూ.4 వేల వరకూ ధర పలుకుతోంది. ఇదే అదునుగా ఇసుక తరలింపు కోసం ప్రత్యేకంగా ట్రాక్టర్లను కొనుగోలు చేసి రంగంలోకి దించుతున్న అక్రమార్కులు అధికారుల కళ్లుగప్పి తరలించేస్తున్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను అధికార బలంతో గంటల్లోనే బయటకు తెచ్చుకుంటున్నారు. రెండు నదుల్లోనూ ఇసుకను ఎడాపెడా తోలేస్తుంటుండటంతో కోట్లాది రూపాయల ప్రభుత్వాదాయానికి గండి పడుతోంది.

ప్రభుత్వ జీఓను అడ్డుపెట్టుకొని...

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా ఇసుక దందా సాగుతున్నా పట్టించుకునేనాథుడే కరువయ్యారు. నిత్యం వందలాదిగా ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా పొరుగు మండలాలకే కాకుండా కర్ణాటకకు భారీగా తరలిపోతోంది. కూటమి ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీఓ ప్రకారం ఇసుకను ఉచితంగా తరలించుకోవచ్చన్న వెసులుబాటు కల్పించింది. దీన్నే ఆసరాగా తీసుకున్న అక్రమార్కులకు పైసా పెట్టుబడి లేకుండా అనుమతులు పొంది ఉచితం మాటున ఇష్టానుసారంగా ఇసుక తరలించి జేబులు నింపుకుంటున్నారు. రాత్రి వేళలో శ్రీరంగరాజుపల్లి, ఊటుకూరు, శాసనకోట, నేతులపల్లి, బాలిరెడ్డిపల్లి, ఎర్రగుంట, పైడేటి, గణపతిపల్లి తదితర ప్రాంతాల్లో ఇసుకను పెద్ద ఎత్తున తవ్వేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటూ ప్రకృతి వనరుగా ఉన్న ఇసుక, మట్టి అక్రమ తరలింపును కాపాడాల్సిన పాలకులు, అధికారులు చోద్యం చూస్తుండటంతో అక్రమార్కులు వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది.

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ట్రాక్టర్‌ రూ.2 వేలు,

కర్ణాటకకు తరలిస్తే రూ.4 వేలు

పెన్నా, జయమంగళి నదులను

ఖాళీ చేస్తున్న ఇసుకాసురులు

పట్టించుకోని అధికారులు

మండలంలోని మోదా వద్ద తాజాగా ఆదివారం జయమంగళి నది నుంచి రెండు ట్రాక్టర్లు, ఊటుకూరు పెన్నా నది వద్ద ఓ ఇసుక ట్రాక్టరును పట్టుకున్నట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మండలంలో ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కేనులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement