గోరంట్ల: ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతున్న చిన్న అంజినప్ప (58) ఆదివారం మృతి చెందాడు. వివరాలు... మండల పరిధిలోని జీనంవాండ్లపల్లిలో భూవివాదంలో భాగంగా ఈనెల 26న అన్నదమ్ములైన బోయ రంగప్ప, అంజినప్ప వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటనలో తమ్ముడు అంజినప్ప తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరులో చికిత్స పొందుతున్న అంజినప్ప ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు అంజినప్పకు భార్య , ముగ్గురు పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యలు తెలిపారు. సీఐ బోయ శేఖర్ తన సిబ్బందితో బెంగళూరు వెళ్లి విచారణ చేపట్టారు.
పోలీసుల వైఫల్యంతోనే...
జీనవాండ్లపల్లికి చెందిన బోయ రంగప్ప, ఆయన తమ్ముడు చిన్న అంజినప్ప మధ్య కొంత కాలంగా భూవివాదం నడుస్తోంది. పోలీసులకు సైతం ఇరు వర్గాలు ఫిర్యాదు చేశాయి. రెండు వర్గాలకు చెందిన రైతులు అధికార పార్టీకి చెందిన వారు కావడం విశేషం. ఒక వర్గానికి చెందిన రైతు మంత్రి సవితమ్మ ప్రధాన అనుచారుడైన ఓ గ్రామ నాయకుడికి అత్యంత సన్నితుడు కావడంతో పోలీసులు వివాదాన్ని పరిష్కరించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. పోలీసులు సకాలంలో సమస్యను పరిష్కరించి ఉంటే అసలు ఘర్షణ జరిగేది కాదని గ్రామస్తులు చెబుతున్నారు.


