ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Jun 1 2026 7:23 AM | Updated on Jun 1 2026 7:23 AM

కనగానపల్లి: మండల పరిధిలోని పర్వతదేవపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాలమేరకు.. పర్వతదేవరపల్లికి చెందిన బాబాసాహెబ్‌ (65) ఆదివారం రాత్రి 7.30 సమయంలో నడుచుకొంటూ జాతీయ రహదారి దాటుతున్నాడు. ఆ సమయంలో బెంగుళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కనగానపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని ప్రమాదంపై విచారించి కేసు నమోదు చేసుకొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

వ్యక్తి బలవన్మరణం

పెనుకొండ రూరల్‌: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గొందిపల్లి గ్రామం కై లాస దేవాలయం సమీపంలో చోటు చేసుకొంది. కియా ఎస్‌ఐ డి. రాఘవయ్య తెలిపిన వివరాలు మేరకు.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరంలోని మల్లాతహళ్లికి చెందిన రాజు (57) ఆలయానికి కిలో మీటరు దూరంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం దుద్దేబండ క్రాస్‌ నుంచి రాజు వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. వీఆర్వో బషీర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించామని చెప్పారు.

బైక్‌ను ఢీకొన్న కారు..

రైతు మృతి

తనకల్లు: మండలానికి చెందిన రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన అన్నమయ్య జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. ములకలచెరువు సీఐ ప్రతాప్‌ తెలిపిన వివరాలమేరకు.. తనకల్లు మండలం గందోడిపల్లికి చెందిన రైతు రెడ్డెప్పరెడ్డి (55) అన్నమయ్య జిల్లా పి.కొత్తకోటలో వ్యాపారులు అప్పుగా తీసుకున్న ఎరగ్రడ్డల డబ్బు వసూలు చేసుకుని రావడానికి బైక్‌పై బయలుదేరాడు. మార్గంమధ్యలోని పులికల్లు మిట్ట వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. గాయపడిన రైతు రెడ్డప్పరెడ్డిని ములకలచెరువు 108 సిబ్బంది హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి ఇద్దరు పిల్లలున్నారు.

నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది

ప్రమాద స్థలంలో రైతు వద్ద లభించిన సుమారు లక్ష రూపాయల నగదును మొలకలచెరువు 108 సిబ్బంది మధుసూదనరెడ్డి, శబరీష్‌ మృతుడి కుటుంబ సభ్యులకు అందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు కృషి చేయడమే కాకుండా, నగదును నిజాయితీగా అప్పగించిన 108 సిబ్బందిని స్థానికులు, బాధిత కుటుంబీకులు అభినందించారు.

ఆలయంలో చోరీ

కూడేరు: మండల పరిధిలోని జల్లిపల్లిలో బస్టాండ్‌లో అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కనే ఉన్న మారెమ్మ ఆలయంలో శనివారం అర్ధరాత్రి అమ్మవారి వెండి, బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఆలయం ముందు రోజూలాగానే శుభ్రం చేస్తున్న వ్యక్తికి ఆలయం గేటు లోపలికి తోసి ఉండడం కనిపించింది. వెంటనే పూజారికి సమాచారం ఇవ్వడంతో ఆయనతో పాటు గ్రామస్తులు వచ్చి పరిశీలించారు. సుమారు 3 కేజీల వరకు వెండి ఆభరణాలు, 3 తులాల బంగారు ఆభరణాలు పోయి ఉండవచ్చని గ్రామస్తులు, ఆలయ పూజారి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement